LOADING...
Pink Planet: అంతరిక్షంలో గులాబీ గ్రహం.. పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు గుర్తించిన శాస్త్రవేత్తలు

Pink Planet: అంతరిక్షంలో గులాబీ గ్రహం.. పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు గుర్తించిన శాస్త్రవేత్తలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

విశ్వాంతరాళంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ చేశారు. గులాబీ రంగులో మెరిసే 'పింక్ ప్లానెట్' వాతావరణాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు అక్కడ ఊహించని ప్రత్యేక లక్షణాన్ని గుర్తించారు. ఈ గ్రహంపై ఉప్పుతో కూడిన మేఘాలు (Salt Clouds) ఉన్నట్లు వారు నిర్ధారించారు. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం,నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) సహాయంతో ఈ అరుదైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ది ఆస్ట్రానమికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.

వివరాలు 

ఏమిటీ ఈ 'పింక్ ప్లానెట్'?

ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాన్ని అధికారికంగా GJ504bగా పిలుస్తారు. దీనిని 2013లో తొలిసారిగా గుర్తించారు. భూమికి ఎంత దూరం? ఈ గ్రహం మన సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇది భూమికి సుమారు 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. గ్రహమా.. నక్షత్రమా? GJ504bను పూర్తిస్థాయి గ్రహంగా శాస్త్రవేత్తలు ఇప్పటికీ నిర్ధారించలేదు. దీనిని 'ప్లానెటరీ-మాస్ కంపానియన్'గా వర్గీకరిస్తున్నారు. అంటే ఇది ఒక భారీ ఎక్సోప్లానెట్ కావచ్చు లేదా పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేకపోయిన చిన్న పరిమాణంలోని బ్రౌన్ డ్వార్ఫ్ అయి ఉండొచ్చు. దీని ద్రవ్యరాశి మన గురు గ్రహం (జూపిటర్) కంటే దాదాపు 25 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

వివరాలు 

వయస్సు.. ఉష్ణోగ్రత ఎంత?

ఈ గ్రహం వయస్సు సుమారు 2.5 నుంచి 4 బిలియన్ సంవత్సరాల మధ్య ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎక్సోప్లానెట్లపై ఉష్ణోగ్రత 1,000 నుంచి 2,000 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది. అయితే GJ504b కాలక్రమేణా చల్లబడటంతో ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత 550 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద నమోదవుతోంది.

Advertisement

వివరాలు 

ఉప్పు మేఘాలు ఎలా ఏర్పడ్డాయి?

ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అనీష్ బాబురాజ్ ప్రకారం.. ఈ గ్రహం వాతావరణం ప్రత్యేకమైన మధ్యస్థ ఉష్ణోగ్రతను కలిగి ఉండటమే ఉప్పు మేఘాల ఏర్పాటుకు కారణమని తెలిపారు. భూమిపై మేఘాలు నీటి ఆవిరితో ఏర్పడతాయి. గురుగ్రహంపై మేఘాలు ప్రధానంగా అమ్మోనియాతో ఏర్పడతాయి. అత్యంత వేడిగా ఉండే గ్రహాల్లో సిలికేట్ కణాలతో కూడిన మేఘాలు కనిపిస్తాయి. పింక్ ప్లానెట్‌పై మాత్రం వాతావరణ ఉష్ణోగ్రత 500 నుంచి 700డిగ్రీల ఫారెన్‌హీట్ మధ్య ఉంటుంది. ఈఉష్ణోగ్రత నీటి లేదా అమ్మోనియా మేఘాలు ఏర్పడేందుకు చాలా ఎక్కువ. అదే సమయంలో సిలికేట్ మేఘాలు ఏర్పడేందుకు మాత్రం తక్కువ. ఈ ప్రత్యేకమైన మధ్యస్థ ఉష్ణోగ్రత కారణంగానే అక్కడ ఉప్పుతో కూడిన మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Advertisement

వివరాలు 

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలా గుర్తించింది?

ఈ గ్రహం చాలా చల్లగా ఉండటంతో భూమిపై ఉన్న సాధారణ టెలిస్కోప్‌లతో దీని కాంతిని విశ్లేషించడం శాస్త్రవేత్తలకు చాలా కాలంగా సవాలుగా మారింది. అయితే అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కేవలం రెండుగంటల్లోనే ఈ గ్రహం వాతావరణంపై కీలక సమాచారం సేకరించింది. గ్రహం నుంచి వెలువడే ఇన్‌ఫ్రారెడ్ కాంతిని విశ్లేషించి దాని స్పెక్ట్రా (లైట్ ఫింగర్‌ప్రింట్)ను రూపొందించింది. ఈ విశ్లేషణలో వాతావరణంలో నీటి ఆవిరి,మీథేన్,కార్బన్ డైఆక్సైడ్,అమ్మోనియా వంటి వాయువుల రసాయన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం ఈ వివరాలను కంప్యూటర్ మోడళ్లతో సరిపోల్చగా..ఆ స్పెక్ట్రా పూర్తిగా సరిపోవాలంటే అక్కడ ఉప్పుతో కూడిన మేఘాలు ఉండాల్సిందే అని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో పింక్ ప్లానెట్‌పై ఉప్పు మేఘాలు ఉన్నాయనే విషయానికి బలమైన ఆధారాలు లభించాయి.

Advertisement