Planetary Parade: నేడు ఆకాశంలో గ్రహాల కవాతు.. ఒకే సరళ రేఖపై 7 గ్రహాలు.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ రాత్రి ఆకాశంలో ఒక మహద్భుతమైన ఖగోళ సంఘటన సాక్షాత్కారమవుతుంది.
సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు సూర్యుడికి ఒకే వైపునకు చేరి, ఒకే సరళరేఖలో కనబడతాయి.
ఖగోళ శాస్త్రంలో దీనిని "ప్లానెట్ పరేడ్" అని పిలుస్తారు. మహాశివరాత్రి అనంతరం గ్రహాల ఈ అద్భుతమైన కూడిక ఆకాశాన్ని మరింత విశేషంగా మార్చనుంది.
మన రిపబ్లిక్ డే పరేడ్‌లానే... ఇవాళ గ్రహాలు కూడా ఖగోళ కవాతుగా కనిపించనున్నాయి.
ఈ సందర్భంగా శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు వంటి గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే మన కళ్లతోనే తిలకించవచ్చు.
అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ అవసరం అవుతుంది.
వివరాలు
మన దేశంలోనూ ప్లానెట్ పరేడ్..
గత జనవరి 21న 6 గ్రహాలు ప్లానెట్ పరేడ్‌లో కనిపించాయి. కానీ ఈసారి ఏకంగా 7 గ్రహాలు ఒకే లైనులో ప్రత్యక్షమవుతాయి.
ఇప్పటికే శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలో ఉంటే, ఇప్పుడు బుధుడు కూడా ఈ సరళరేఖలో చేరిపోతున్నాడు.
ఈ అరుదైన ఖగోళ దృశ్యం ఇవాళ మనకు వీక్షణం కానుంది. ఈ ప్లానెట్ పరేడ్ మన దేశంలోనూ కనిపించనుంది.
ఇవాళ రాత్రి 8:30 గంటల సమయంలో ఈ సప్త గ్రహ కూటమి దర్శనమిస్తుంది.
ఆకాశం మేఘాల నుంచి స్వేచ్ఛ పొందితే, కాలుష్యం తక్కువగా ఉంటే ఈ దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.
వివరాలు
మళ్లీ 2040లో..
అంతేకాకుండా, "స్టార్ వాక్-2", "స్టెల్లారియం" లాంటి యాప్‌ల ద్వారా కూడా ఈ ఖగోళ కవాతును వీక్షించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, ఈ గ్రహ పరేడ్ ప్రభావంతో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని, కొన్ని రాశుల వారికి ఇది అనుకూలించదని జ్యోతిష పండితులు అంటున్నారు.
ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన మాత్రమేనని, దీని వల్ల భూలోకంలో ఎలాంటి ఉపద్రవాలు జరుగవని స్పష్టం చేస్తున్నారు.
ఈ సప్త గ్రహ పరేడ్‌ను ఈసారి మిస్ అయితే, మళ్లీ 2040లో మాత్రమే ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.