
Autonomous Satellites: భారత్ రక్షణలో విప్లవాత్మక అడుగు.. 2027లో నిఘా శాటిలైట్ సమూహం ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రక్షణ రంగంలో భారతదేశం కీలక ముందడుగు వేస్తోంది. తొలిసారిగా స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా ఉపగ్రహాల సమూహాన్ని అభివృద్ధి చేస్తున్నది. ఇవి భిన్న ముప్పులపై స్వయంగా గమనిక పెట్టడమే కాకుండా, పరస్పరం సమాచారం పంచుకుని సమన్వయంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ ప్రాజెక్టు త్రివిధ దళాల ఉమ్మడి విభాగం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (DSA) ఆధ్వర్యంలో అమలవుతోంది. ఈ శాటిలైట్ల అభివృద్ధికి కేంద్ర రక్షణ శాఖ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కెప్లర్ ఏరోస్పేస్ సంస్థతో రూ. 40 లక్షల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఉపగ్రహాలను 2027లో ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపనున్నారు.
Details
స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శాటిలైట్లు
సంప్రదాయ ఉపగ్రహాలు భూమిపై ఉన్న నియంత్రణ కేంద్రాల నుంచి ఆదేశాల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. కానీ సమయం విలువైన ఆధునిక యుద్ధాల్లో ఇది లోపంగా మారుతోంది. ఈ లోటును పూరించేందుకు భారత్ అభివృద్ధి చేస్తున్న కొత్త శాటిలైట్లు భూకేంద్రం ఆదేశాలకై ఎదురు చూడకుండా స్వతంత్రంగా స్పందిస్తాయి. వీటిలోని శక్తివంతమైన AI, మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌లు అనుమానాస్పద లక్ష్యాలను గుర్తించి పరిశీలిస్తాయి. సమూహంలోని శాటిలైట్లు పరస్పరం సంభాషించుకుంటూ ఆపసోపాలు లేకుండా వాస్తవ సమయ నిఘాను నిర్వహిస్తాయి. భద్రతాపరంగా ఇవి అంతరిక్షంలో ఓ మెదడు లా పనిచేస్తాయని కెప్లర్ వ్యవస్థాపకుడు నవనీత్ సింగ్ వ్యాఖ్యానించారు.
Details
నూతన టెక్నాలజీ విశేషాలు
ఈ ఉపగ్రహాల్లో ఆప్టికల్, రాడార్, ఎలక్ట్రానిక్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు అమర్చబడతాయి. ఇవి: శత్రు బలగాల కదలికలు రాడార్ సంకేతాలు మొబైల్ టవర్ల కార్యకలాపాలు వంటి వాటిపై గమనిక ఉంచగలవు. ఒక శాటిలైట్ ఏదైనా అసాధారణ విషయం గమనిస్తే, అదే సమాచారం ఇతర శాటిలైట్లకు తెలియజేస్తుంది. తద్వారా పూర్తి పరిస్థితిని విశ్లేషించే సామర్థ్యం ఏర్పడుతుంది.
Details
ప్రయోగాలు, భవిష్యత్ దిశ
2027లో తొలి ప్రయోగం చేపట్టనున్నట్లు కెప్లర్ సహ వ్యవస్థాపకుడు కిరణ్ శర్మ తెలిపారు. తొలి దశలో ప్రతి శాటిలైట్ బరువు సుమారు 15 కిలోలుగా ఉంటుందని వెల్లడించారు. తదుపరి దశల్లో అత్యాధునిక, భారీ శాటిలైట్లను అభివృద్ధి చేయనున్నారు. రహస్య సమాచారం భద్రత ఈ శాటిలైట్లను దేశీయంగా అభివృద్ధి చేయడం వల్ల సున్నితమైన రహస్య సమాచార భద్రతలోనూ భారత్‌కు ఆత్మనిర్భరత లభిస్తుంది. భవిష్యత్ యుద్ధ వేదికల్లో ఇది కీలక మార్గదర్శిగా నిలవనుంది.