LOADING...
IMD: విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం
విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం

IMD: విపత్తుల అంచనాలో కొత్త అధ్యాయం.. INSAT-4 శాటిలైట్లతో సాంకేతిక విప్లవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

భూ తాపం, వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన విధానాలను, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తుపాన్లు, భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల అంచనాల్లో పొరపాట్ల వల్ల దేశాలే అతలాకుతలమవుతున్న సందర్భాలు తారసపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ అంచనాల్లో మరింత కచ్చితత్వాన్ని సాధించేందుకు భారత వాతావరణ శాఖ (IMD) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)తో కలిసి చురుకుగా చర్యలు చేపడుతోంది.

Details

నాల్గో తరం ఇన్‌సాట్ ఉపగ్రహాల ప్రణాళిక

వాతావరణ అంచనాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఐఎండీ, ఇస్రో భాగస్వామ్యంతో నాల్గో తరం ఇన్‌సాట్ (INSAT-4 series) ఉపగ్రహాలను రూపొందించి నింగిలోకి పంపే ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన రూ.1,800 కోట్ల వ్యయం భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ భరించనుంది. ఈ శాటిలైట్లలో అత్యాధునిక సెన్సర్లు అమర్చబడి ఉండనున్నాయి.

Details

ఇప్పటికే వినియోగంలో ఉన్న ఉపగ్రహాలు 

ప్రస్తుతం ఐఎండీ ఉపయోగిస్తున్న ఉపగ్రహాల్లో INSAT-3DR, INSAT-3DS (ఇస్రో అభివృద్ధి చేసినవి), అలాగే యూరోపియన్ యూనియన్‌కి చెందిన EUMETSAT, METOP-B/C, OCEANSAT-3 తదితర అంతర్జాతీయ శాటిలైట్లు ఉన్నాయి. INSAT-3DR ఉపగ్రహాన్ని 2016 సెప్టెంబర్ 8న ప్రయోగించగా, INSAT-3DSను ఇటీవలే - 2024 ఫిబ్రవరి 17న - రూ.480 కోట్ల వ్యయంతో ప్రయోగించారు. ఇవి వాతావరణ అంచనాల ఖచ్చితత్వం, విపత్తుల హెచ్చరికలు, ఉపరితల విశ్లేషణ కోసం ఇమేజర్‌, సౌండర్‌ వంటి ఆధునిక పరికరాలను కలిగి ఉన్నాయి.

Details

ఉత్పాతాల గుర్తింపులో సవాళ్లు 

ప్రస్తుత శాటిలైట్లలో ఉన్న పరిమిత రిజల్యూషన్, అసంపూర్ణ ఉపగ్రహ డేటా వలన క్లౌడ్‌ బరస్ట్‌, ఉరుములు, లోకల్‌గా వచ్చే భారీ వర్షపాతాలు వంటి సంఘటనల గుర్తింపులో కొంత అవాంతరం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో INSAT-4 సిరీస్ ఉపగ్రహాలను అత్యాధునిక సెన్సర్లతో తయారు చేస్తూ ఐఎండీ-ఇస్రో సంయుక్తంగా పని చేస్తున్నాయి. వీటివల్ల మారుమూల ప్రాంతాల్లోనూ వాతావరణ పర్యవేక్షణను మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

Details

ఉపగ్రహ సాంకేతికత వాడకంలో విస్తరణ

వాతావరణ అంచనాల్లో ఉపగ్రహ డేటా కీలకంగా మారింది. INSAT శాటిలైట్లు 1 కి.మీ. దృశ్య పరిధి, 4 కి.మీ. పరారుణ పరిధి కలిగి ఉండి, 15 నిమిషాలకోసారి ఛాయాచిత్రాలు పంపిస్తున్నాయి. గాలులు, తేమ, నీటిఆవిరి లాంటి కీలక డేటాను సేకరిస్తున్నాయి. నౌకాస్టింగ్, తుపాన్లు, రుతుపవనాల వ్యాప్తి అంచనాల్లో మెరుగుదలతోపాటు, సకాలంలో హెచ్చరికలిచ్చే సామర్థ్యం పెరిగింది. ఉపగ్రహ డేటా ఆధారంగా వాతావరణ మోడళ్ల ఖచ్చితత్వం 20-30 శాతం మేర పెరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Details

విదేశాల్లో అత్యాధునిక వాతావరణ శాటిలైట్లు

అమెరికా వాతావరణ అంచనా మోడళ్లు కృత్రిమ మేధ (AI), మెషీన్ లెర్నింగ్ (ML) ఆధారంగా అభివృద్ధి అవుతున్నాయి. ఐరోపా ఇటీవల METEOSAT Third Generation Sounder-1 (MTG-S1) అనే అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ఉష్ణోగ్రత, తేమ, పర్యావరణంలోని ట్రేస్ వాయువుల గురించి అత్యధిక ఫ్రీక్వెన్సీ సమాచారం ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంది. ఇది అత్యవసర వాతావరణ మార్పుల సంకేతాలను ముందుగానే గుర్తించి, ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించడంలో దోహదపడుతోంది.

Details

కొత్త ఉపగ్రహం నిర్మాణంలో 

2016లో ప్రయోగించిన INSAT-3DR శాటిలైట్ జీవితకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐఎండీ-ఇస్రో సంయుక్తంగా కొత్త శాటిలైట్‌ను అత్యాధునిక సెన్సర్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వం మరింత మెరుగవుతుందని అధికారులు చెబుతున్నారు.