RIL AGM 2024: సెట్ అప్ బాక్స్ కోసం రిలయన్స్ జియో TvOS.. కాల్‌లోనే ఏఐ సేవలు
రిలయన్స్ జియో కొత్తగా జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. ఈ కొత్త సాంకేతికత జియో సెటాప్ బాక్స్ వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్ ఛానెల్ సేవలను అందించనుంది. 47వ వార్షిక సాధారణ సమావేశంలో, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ వివరాలను ప్రకటించారు. జియో టీవీ ఓఎస్‌తో,వినియోగదారులు 4కె యూహెచ్‌డీ, డాల్బీ అట్మాస్,డాల్బీ విజన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఆస్వాదించగలరని తెలిపారు. అలాగే, కొత్తగా "హెలో జియో" అనే ఏఐ బటన్ సదుపాయాన్ని సెటాప్ బాక్స్ రిమోట్‌లో చేర్చారు. ఈ సదుపాయంతో వాయిస్ కమాండ్ల ద్వారా టీవీని కంట్రోల్ చేయవచ్చు.
జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీసులను ప్రారంభించిన ఆకాశ్ అంబానీ
రిమోట్‌లోని మైక్ బటన్ ద్వారా వాల్యూమ్ నియంత్రణ వంటి పనులను సులభంగా చేయొచ్చు. అలాగే, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్ స్టార్ వంటి యాప్స్‌ను సైతం యాక్సెస్ చేయవచ్చని పేర్కొన్నారు. ఇంతేకాకుండా, జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీసులను కూడా ఆకాశ్ అంబానీ ప్రారంభించారు. వినియోగదారులు ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ ద్వారా కాల్స్‌ను రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రికార్డులు జియో క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా నిల్వ అవుతాయి. అవసరమైతే ఆ రికార్డులను వేరే భాషలో ట్రాన్స్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.