Samsung: డివైజ్‌లలో AIని యూజర్లు ఎలా ఉపయోగిస్తున్నారు?.. శాంసంగ్ కీలక అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వినియోగదారులు తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారు? దానిపై ఎలా స్పందిస్తున్నారు? అనే అంశాలను శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నిశితంగా పరిశీలిస్తోంది. భవిష్యత్‌లో AI అనుభవాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వివిధ స్థానిక మార్కెట్ల నుంచి వస్తున్న యూజర్ల అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకుంటోంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌లో MX డివిజన్‌కు చెందిన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీస్ హెడ్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జే కిమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. AI వినియోగదారుల రోజువారీ కార్యకలాపాల్లో ప్రత్యేకంగా కనిపించకుండా.. బ్యాక్‌గ్రౌండ్‌లో సజావుగా పనిచేసేలా చేయడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
వివరాలు
స్థానిక మార్కెట్ల నుంచి ఫీడ్‌బ్యాక్ కీలకం..
వినియోగదారులు AIని ఎలా స్వీకరిస్తున్నారు, దానికి ఎలా స్పందిస్తున్నారు, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే అంశాలపై శాంసంగ్ ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోందని జే కిమ్ చెప్పారు.
వివిధ స్థానిక మార్కెట్ల నుంచి తమకు పెద్ద మొత్తంలో ఫీడ్‌బ్యాక్ వస్తోందని, వాటి ద్వారా తెలుసుకున్న విషయాలను క్రమంగా భవిష్యత్ AI అనుభవాల్లో అమలు చేస్తామని తెలిపారు.
AI వినియోగం వల్ల రోజువారీ జీవితంలో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకునే దశలో ప్రస్తుతం తాము ఉన్నామని కిమ్ పేర్కొన్నారు.
వివరాలు
2024లో తొలిసారి Galaxy AI పరిచయం..
శాంసంగ్ 2024లో Galaxy S24 సిరీస్‌తో తొలిసారిగా Galaxy AIని పరిచయం చేసింది.
AI ఫీచర్లను అభివృద్ధి చేసే సమయంలో అర్థవంతంగా ఉండటం, అందరికీ అందుబాటులో ఉండటం, భద్రత అనే మూడు ప్రధాన అంశాలకు కంపెనీ ప్రాధాన్యం ఇచ్చింది.
వినియోగదారులపై నిర్వహించిన పరిశోధన ఆధారంగా ఈ AI ఫీచర్లను రూపొందించామని, ఇందుకోసం గూగుల్‌తో కలిసి పనిచేశామని జే కిమ్ తెలిపారు.
Gemini ఆధారంగా పనిచేసే టూల్స్‌లో Circle to Search వంటి ఫీచర్లు అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.