LOADING...
Human Blood Cells: ల్యాబ్‌లోనే మానవ రక్తకణాల సృష్టి.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సంచలన విజయం
ల్యాబ్‌లోనే మానవ రక్తకణాల సృష్టి.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సంచలన విజయం

Human Blood Cells: ల్యాబ్‌లోనే మానవ రక్తకణాల సృష్టి.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల సంచలన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తొలిసారిగా ల్యాబ్‌లో మానవ రక్త కణాలను సృష్టించడంలో విజయవంతమయ్యారు. ఈ ప్రక్రియ, సహజంగా గర్భస్థ శిశువులో జరిగే అభివృద్ధిని అనుకరిస్తూ, మానవ స్టెమ్ సెల్స్ (కణ మూలాలు) సహాయంతో చేశారు. వీరి పరిశోధన భవిష్యత్తులో ల్యుకీమియా (రక్త క్యాన్సర్) వంటి రక్త సంబంధ వ్యాధులను అర్థం చేసుకోవడంలో, అలాగే దీర్ఘకాలిక రక్త కణ మార్పిడి చికిత్సల అభివృద్ధికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. "డిష్‌లో ఎరుపు రంగు కనిపించిన క్షణం ఎంతో ఉత్సాహంగా అనిపించింది," అని కేంబ్రిడ్జ్ గర్డన్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన డాక్టర్ జితేష్ న్యూపేన్ తెలిపారు.

సంభావ్య ప్రభావం 

పునరుద్ధరణ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

ల్యాబ్‌లో పెంచిన ఈ రక్త కణాలు, పేషెంట్‌ శరీరంలోని కణాలతో దెబ్బతిన్న భాగాలను సరిచేసే రీజెనరేటివ్ థెరపీస్‌లో కీలక పాత్ర పోషించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "ఇది ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నా, ల్యాబ్‌లో మానవ రక్తకణాల ఉత్పత్తి చేయగలగడం భవిష్యత్‌ రీజెనరేటివ్ చికిత్సలకు పెద్ద అడుగు," అని ఈ పరిశోధన ప్రధాన రచయిత ప్రొఫెసర్ అజీమ్ సురానీ తెలిపారు. హీమటోపోయెటిక్ స్టెమ్ సెల్స్‌ అనే కణాలు ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు వంటి అన్ని రకాల రక్తకణాలుగా మారే సామర్థ్యం కలిగి ఉంటాయి.

వినూత్న అభివృద్ధి 

'హీమటాయిడ్స్' అనే కొత్త నిర్మాణాల సృష్టి

శాస్త్రవేత్తలు 'హీమటాయిడ్స్' అని పిలిచే ఎంబ్రియో లాంటి నిర్మాణాలు ల్యాబ్‌లో తయారు చేశారు. ఇవి సుమారు రెండు వారాల తర్వాత రక్తం ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ, మానవ భ్రూణ అభివృద్ధి ఎలా జరుగుతుందో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఇవి నిజమైన భ్రూణాలు కావు, ఎందుకంటే వీటిలో యోక్ సాక్, ప్లాసెంటా వంటి ఇతర ముఖ్యమైన భాగాలు లేవు.

మెథడాలజీ 

కొత్త పద్ధతి - పాత పద్ధతుల కంటే భిన్నం

ఇప్పటి వరకు రక్తకణాల తయారీకి శాస్త్రవేత్తలు ప్రోటీన్ల మిశ్రమాలను ఉపయోగిస్తుండేవారు. అయితే కేంబ్రిడ్జ్ బృందం రూపొందించిన ఈ కొత్త పద్ధతి సహజ అభివృద్ధిని అనుకరిస్తుంది. ఇది స్వయంగా ఏర్పడే మానవ ఎంబ్రియో మోడల్ ఆధారంగా ఉంటుంది. దీని వల్ల మానవ అభివృద్ధి ఎలా జరుగుతుందో శాస్త్రవేత్తలకు మరింత లోతుగా అర్థమవుతుంది.

నైతిక ఆమోదం 

నైతిక అనుమతులతో కూడిన పరిశోధన

భ్రూణ అభివృద్ధిని అధ్యయనం చేసే ప్రతి పరిశోధనకు నైతిక కమిటీ అనుమతి తప్పనిసరి. ఈ అధ్యయనానికి కూడా ఆమోదం లభించింది. శాస్త్రవేత్తలు ఈ ఎంబ్రియో మోడళ్లను గర్భధారణ తర్వాత 14 రోజుల వరకు మాత్రమే పెంచారు. ఇది అనేక దేశాల్లో చట్టబద్ధమైన గరిష్ట పరిమితి. ఈ అధ్యయనం ప్రముఖ శాస్త్రపత్రిక Cell Reports‌లో ప్రచురితమైంది.