Page Loader
Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు 
సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

Japan: సముద్రపు నీటిలో కరిగిపోయే కొత్త ప్లాస్టిక్‌ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సముద్ర జలాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు గణనీయమైన అభివృద్ధిగా, జపాన్‌కు చెందిన 'రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (CEEMS)'లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఓ కొత్త రకం ప్లాస్టిక్‌ను రూపొందించారు. ఈ ప్లాస్టిక్‌ విశేషత ఏమిటంటే, అది ఉప్పున్న సముద్రపు నీటిలో తేలికగా కరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ ఆశాదీపంగా కనిపిస్తోంది. సముద్ర జీవుల రక్షణతో పాటు, జీవవైవిధ్యానికి గట్టి మద్దతు అందించగలిగే సామర్థ్యం దీనికి ఉంది.

వివరాలు 

రహస్యమంతా సమ్మేళనంలోనే.. 

ఈ కొత్త ప్లాస్టిక్‌ను 'సుప్రమోలిక్యులర్ ప్లాస్టిక్'గా పిలుస్తున్నారు. 'ఇది సాధారణ వాతావరణంలో మన్నికగా ఉండగా, ఉప్పు కలిసిన నీటిలో క్రమంగా విచ్ఛిన్నమయ్యేలా తయారు చేశారు. దీని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది 'రివర్సబుల్ సాల్ట్ బ్రిడ్జ్‌లు'. సముద్రపు ఉప్పునీటిలోని ఎలక్ట్రోలైట్లు ఈ బ్రిడ్జ్‌లను అస్థిరం చేస్తాయి. దీనివల్ల కొన్ని రసాయనిక మార్పులు ఏర్పడి, ప్లాస్టిక్‌ను హానికరం కాని సమ్మేళనాలుగా విఘటింపజేస్తాయి. ఈ విధంగా, మైక్రోప్లాస్టిక్స్ వంటి విషపూరిత అవశేషాలు మిగలకుండా, సముద్రపు జీవులకు గానీ, వారి పరిసరాల పర్యావరణానికి గానీ ఎలాంటి ప్రమాదం లేకుండా కరిగిపోతుంది.

వివరాలు 

సాంప్రదాయ ప్లాస్టిక్‌లకు స్థిరమైన ప్రత్యామ్నాయం 

సాంప్రదాయ ప్లాస్టిక్‌లు శతాబ్దాలు కూడా క్షీణించకుండా ఉండగలవన్న విషయం తెలిసిందే. అవి సముద్రాలలో పేరుకుపోతూ పెద్ద ఎత్తున వ్యర్థ ప్రాంతాలను ఏర్పరుస్తుంటాయి. అలా కాలక్రమేణా ఏర్పడే మైక్రోప్లాస్టిక్స్‌ జీవచక్రంలోకి ప్రవేశించి, జలచరాల ఆరోగ్యాన్ని, మానవుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కానీ ఈ నూతన రకాల ప్లాస్టిక్ ఆ సమస్యకు పరిష్కారమవుతుందని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఇది ప్లాస్టిక్‌పై ఆధారపడే రంగాల్లో, ముఖ్యంగా తయారీ పరిశ్రమల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు దారితీసే అవకాశం ఉంది.

వివరాలు 

వ్యవహారిక ప్రయోజనాలు  

ఈ రకమైన ప్లాస్టిక్‌ను ప్యాకేజింగ్ పదార్థాల తయారీకి, ఒక్కసారి ఉపయోగించే వస్తువులకే కాదు... ఫిషింగ్ నెట్లతో పాటు, సముద్రంలో ఉపయోగించే పరికరాల తయారీకి కూడా వాడవచ్చు. సాధారణ ప్లాస్టిక్‌లను ఈ పర్యావరణ స్నేహపూరిత పదార్థాలతో భర్తీ చేస్తే, పరిశ్రమలు గ్లోబల్ స్థాయిలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలవు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, దీని వల్ల భవిష్యత్తులో ప్లాస్టిక్ తయారీ, వినియోగ విధానాలు పూర్తిగా మారిపోవచ్చు అనే నమ్మకం శాస్త్రవేత్తల్లో ఉంది.