Gold Nanoparticles in Finland Spruce Trees: ఆ చెట్ల ఆకుల్లో బంగారం.. ఫిన్లాండ్ పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనకు బంగారం కావాలంటే, సాధారణంగా మనం జువెలరీ షాపుకి వెళ్ళి కొంటాము, లేదా ఆన్‌లైన్ ద్వారా, లేక డిజిటల్ గోల్డులో పెట్టుబడి పెడతాము. అయితే .. చెట్ల ఆకుల్లో బంగారం ఉంది అనే విషయం తాజాగా ఫిన్‌లాండ్‌లో జరిపిన పరిశోధనల్లో తేలింది. ఫిన్లాండ్ పరిశోధకులు 'నార్వే స్ప్రూస్' (Norway spruce) అనే చెట్ల ఆకుల్లో నానో పరిమాణంలో బంగారు కణాలు (nanoparticles) కనుగొన్నారని తెలిపారు. అంటే.. ఆ చెట్ల ఆకుల్లో బంగారం ఉన్నట్లే. కాకపోతే.. అది భారీగా ఉండదు. తక్కువ పరిమాణంలో ఉంటుంది.
వివరాలు
ఈ పని ఎండోఫైట్స్ బ్యాక్టీరియా చేస్తోంది
ఇలాంటి బంగారం ఆకుల్లోకి ఎలా వస్తుందో అనేది ప్రధాన ప్రశ్న. మనకు తెలుసు, కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలు నీటిని వేర్ల ద్వారా ఆకుల్లోకి తీసుకుంటాయి, కానీ సాధారణంగా బంగారం వాటిలోకి రాదు. పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం, సూక్ష్మజీవులు .. ఎండోఫైట్స్ బ్యాక్టీరియా ఈ పని చేస్తోందని తేల్చారు. ఈ బ్యాక్టీరియా ఆకుల్లో బంగారాన్ని ఘన కణాలుగా మారుస్తుంది. ఫిన్లాండ్ జియాలజికల్ సర్వే, ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. 2025 అక్టోబర్‌లో 'జర్నల్ ఆఫ్ హెజార్డస్ మెటీరియల్స్'లో ఈ అధ్యయనం ప్రచురించబడింది. ఈ కనుగొనడం ఖనిజాల అన్వేషణలో కొత్త మార్గాన్ని చూపిస్తుంది.
వివరాలు
భూగర్భంలో బంగారం సాధారణంగా ద్రవ రూపంలో ఉంటుంది
పరిశోధనలు ఫిన్లాండ్ ఉత్తర భాగంలోని కిట్టిలా బంగారు గని సమీపంలో జరిగాయి. పరిశోధకులు 23 నార్వే స్ప్రూస్ చెట్ల నుండి 138ఆకు శాంపిళ్లను సేకరించి,మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించగా,ఆకుల చివరి భాగాల్లో 200 నానోమీటర్ పరిమాణంలో బంగారు కణాలు కనిపించాయి. ఈ కణాలు సహజంగా ఏర్పడినవే, మానవుల తయారీ కాదు. దగ్గరలో బంగారు గని ఉండటంతో, చెట్ల ద్వారా బంగారం కణాలు ఆకుల్లోకి చేరినట్టు అనుకోవచ్చు. భూగర్భంలో బంగారం సాధారణంగా ద్రవ రూపంలో ఉంటుంది. చెట్ల వేర్లు నీటిని పీల్చినప్పుడు,ఈ బంగారం రసాలు ఆకుల్లోకి వస్తాయి.ఆకుల్లో చేరిన తర్వాత,సూక్ష్మజీవులు బంగారాన్ని ఆక్సిడైజ్ చేసి ఘన కణాలుగా మారుస్తారు. ఈ బ్యాక్టీరియా ఎండోఫైటిక్ స్వభావం కలిగి ఉంటుంది,అంటే చెట్లలో నివసిస్తూ,వాటి కోసం హానికరం చేయకుండా పనిచేస్తుంది.
వివరాలు
బంగారు రేణువులు కూడా ఆకుల్లోకి..
పరిశోధనలో, ఈ మైక్రోబ్స్ బంగారు టాక్సిసిటీని తగ్గించడమే కాక, చెట్లకు అవసరమైన పోషకాలను అందించడంలో కూడా సహాయపడతాయని తేలింది. అందువల్ల అన్ని చెట్ల ఆకుల్లో బంగారం ఉండదు, అలాగే అన్ని చెట్లలో ఈ బ్యాక్టీరియా ఉండదు. ముఖ్యంగా, కిట్టిలా ప్రాంతంలోని నేలలో బంగారం ఎక్కువగా ఉండటంతో, ఆ ప్రాంతపు చెట్లు నీటిని పీల్చినప్పుడు బంగారు రేణువులు కూడా ఆకుల్లోకి చేరతాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిశోధనలు అవసరం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఖనిజాల అన్వేషణలో విప్లవాత్మక మార్గం అవ్వవచ్చని నిపుణులు పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో భూగర్భ గనులను తవ్వడం ఖర్చుతో కూడినది,పర్యావరణానికి హానికరం. కానీ, చెట్ల ఆకులను పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో బంగారం నిల్వలను గుర్తించవచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది.
వివరాలు
స్వర్ణ అన్వేషణలో ఇది కొత్త మార్గం
దీనిని బయోప్రాస్పెక్టింగ్ అని పిలుస్తారు. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు దీన్ని విస్తరించాలని యోచిస్తున్నారు, ల్యాబ్‌లో కూడా సూక్ష్మజీవుల సహాయంతో ప్రక్రియను చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆకుల్లోని బంగారాన్ని బయటకు తీయడం ఇప్పటి టెక్నాలజీతో చాలా ఖర్చుతో కూడిన పని. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత సులభంగా, చవకగా మారితే, భూగర్భ గనుల దగ్గర చెట్లు పెంచి, వాటిపై బ్యాక్టీరియాను అభివృద్ధి చేసి, ఆకుల్లో ఘన బంగారం తయారుచేసి, ల్యాబ్‌లో సేకరించడానికి అవకాశాలు ఉండవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ స్వర్ణ అన్వేషణలో ఇది కొత్త మార్గాన్ని చూపుతుంది.