Solar Storm: 20 ఏళ్ల తర్వాత భారీ సోలార్ స్టోర్మ్.. గాల్లో రేడియేషన్ పెరుగుదల.. విమానాలకు ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యుడు తాజాగా అత్యంత శక్తివంతమైన ఎక్స్‌రే ఫ్లేర్స్‌ను విడుదల చేయడంతో ఆకాశంలో అద్భుతమైన ఆరోరాలు దర్శనమివ్వడమే కాకుండా, గత రికార్డులను దాటే స్థాయిలో ఒక భారీ సోలార్ స్టోర్మ్ భూమిని తాకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో భాగమైన సోలార్ మ్యాక్సిమమ్ దశలో(2024 నుంచి) ఉన్నందున భూమిపై జియోమాగ్నెటిక్ తుఫాన్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణాలకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని యుకేలోని సరే స్పేస్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవలి సూర్య కార్యకలాపాల కారణంగా కిరణాల స్థాయి ఒక్కసారిగా భారీగా పెరిగి, దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా భూమి మీద నుంచే ఈ రేడియేషన్ గుర్తించేంత స్థాయికి చేరిందని తెలిపారు.
వివరాలు
రేడియేషన్ స్థాయిలు సాధారణ స్థాయికి పది రెట్లు ఎక్కువ
ఈ విషయంపై స్పందించిన యూకేలోని సరే యూనివర్సిటీ శాస్త్రవేత్త క్లైవ్ డయ్యర్ మాట్లాడుతూ, 2006 డిసెంబర్ తర్వాత భూమి మీద నమోదైన అతిపెద్ద ఘటన ఇదేనన్నారు. నవంబర్ 11న సూర్యుడి నుంచి వచ్చిన భారీ ఫ్లేర్ భూమిని తాకిన సమయంలో యుకే,నెదర్లాండ్స్ వాతావరణ శాఖలు గాలి బెలూన్లను 40వేల అడుగుల ఎత్తుకు పంపి కొలతలు చేయగా, అక్కడ రేడియేషన్ స్థాయిలు సాధారణ స్థాయికి పది రెట్లు ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. ఇవి గత 20 ఏళ్లలో నమోదైన అత్యధిక రీడింగ్స్‌గా పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ అధిపతి కీత్ రైడెన్ మాట్లాడుతూ, కొత్తగా ఉపయోగించిన అత్యవసర బెలూన్ సెన్సర్లు తొలిసారి నిజ సంఘటనలో ఉపయోగించగా, యూకే గగనతలంలో రేడియేషన్ వ్యాప్తిని త్రీడి రూపంలో స్పష్టంగా చూపించాయన్నారు.
వివరాలు
భవిష్యత్‌లో ఇంకా పెద్ద జియోమాగ్నెటిక్ తుఫాను భూమిని తాకే అవకాశం
ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఇంకా పెద్ద జియోమాగ్నెటిక్ తుఫాను భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది జరిగితే విమానాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యవస్థలు దెబ్బతిని, విమాన నియంత్రణకు కీలకమైన డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గత చరిత్రను చూస్తే మరింత భారీ సంఘటనలు జరిగే అవకాశం స్పష్టమని, అందుకు ముందే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని క్లైవ్ డయ్యర్ హెచ్చరించారు. రికార్డుల్లో నమోదైన అత్యంత శక్తివంతమైన సోలార్ స్టోర్మ్ "1859లో జరిగిన "క్యారింగ్టన్ ఈవెంట్"గా గుర్తింపు పొందింది.
వివరాలు
భూమధ్యరేఖ సమీపంలో కూడా ఆరోరాలు
1859 సెప్టెంబర్ 1-2 తేదీల్లో సోలార్ సైకిల్-10 సమయంలో వచ్చిన ఆ భారీ సూర్య తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, అమెరికాలోని రాకీ పర్వతాల్లో పనిచేస్తున్న బంగారు గనికారులు నిద్రలేచి బయటకు వచ్చి చూసేంతగా ఆకాశమంతా ఆరోరాల వెలుగులు మెరిసినట్లు అప్పటి కథనాలు చెబుతున్నాయి. తక్కువ అక్షాంశాల్లో, భూమధ్యరేఖ సమీపంలో కూడా ఆరోరాలు కనిపించాయి. యూరోప్, ఉత్తర అమెరికా అంతటా టెలిగ్రాఫ్ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోగా, కొన్ని చోట్ల ఆపరేటర్లకు షాక్‌లు తగిలిన ఘటనలు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అగ్నిప్రమాదాలు చెలరేగినట్టు సమాచారం ఉంది.