Page Loader
Shubhanshu Shukla: అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు శుక్లా.. ISS లో 'మేథి','పెసర' విత్తనాలను వేసి..
అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు శుక్లా.. ISS లో 'మేథి','పెసర' విత్తనాలను వేసి..

Shubhanshu Shukla: అంతరిక్షంలో రైతుగా మారిన శుభాంశు శుక్లా.. ISS లో 'మేథి','పెసర' విత్తనాలను వేసి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అనేక విభిన్న పరిశోధనల్లో పాల్గొంటున్నారు. ఈ పరిశోధనల భాగంగా ఆయన తాజాగా 'రైతు'గా మారారు. రోదసిలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర వంటి పంటలపై కలిగే ప్రభావాన్ని తెలుసుకునేందుకు శుక్లా ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ ప్రయోగంలో భాగంగా, చిన్న గాజు పాత్రలలో మెంతి, పెసర విత్తనాలను వేశారు. ఆ విత్తనాలను ఐఎస్‌ఎస్‌లోని ప్రత్యేక నిల్వ ఫ్రీజర్‌లో ఉంచి, గ్రావిటీ లేని పరిస్థితుల్లో అవి ఎలా మొలకెత్తుతాయో పరిశీలిస్తున్నారు. ఈ మొలకలపై ఆయన తీసిన ఫోటోలు కూడా ఇప్పుడు చర్చకు కేంద్రబిందువుగా మారాయి.

వివరాలు 

మొలకల్లో జరిగే జన్యు మార్పులు, వాటిలోని పోషక విలువలపై విశ్లేషణ

ఈ ప్రయోగం ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రవికుమార్ హోసమణి, ఐఐటీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తల సహాయంతో శుక్లా ఈ ప్రయోగాన్ని చేశారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత, ఆ మొలకల్లో జరిగే జన్యు మార్పులు, వాటిలోని పోషక విలువలపై విశ్లేషణ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రయోగానికి మద్దతు ఇచ్చిన ఆక్సియం స్పేస్ సంస్థ వెల్లడించింది. ఇక మరో ప్రయోగంలో శుక్లా మైక్రోఆల్గేల (సూక్ష్మ శివల)పై అధ్యయనం చేశారు. జీరో గ్రావిటీలో ఇవి ఆహారం, ఆక్సిజన్, జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయా అనే విషయాన్ని ఈ పరిశోధనలో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వివరాలు 

పరిశోధకులు, అంతరిక్ష కేంద్రం మధ్య వారధిగా ఉండటం సంతృప్తినిస్తుంది: శుక్లా 

తాను చేస్తున్న పరిశోధనల గురించి శుక్లా మాట్లాడుతూ.. స్టెమ్ సెల్స్‌పై పరిశోధన, విత్తనాలపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాన్ని తెలుసుకోవడం, అంతరిక్ష కేంద్రంలో స్క్రీన్‌ల ద్వారా జరిగే సంభాషణలను వ్యోమగాములు ఎలా విశ్లేషిస్తారు అనే మానసిక సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించడం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రయోగాలన్నింటిలో భాగమవడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. పరిశోధకులు, అంతరిక్ష కేంద్రం మధ్య వారధిగా ఉండటం తనకు సంతృప్తినిస్తుంది అని శుక్లా తెలిపారు.

వివరాలు 

వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా పరిశోధనలు

గత వారం యాగ్జియం-4 (Axiom-4) ప్రైవేట్ స్పేస్ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా ఇతర ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన అనేక ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. రోదసిలో మానవ శరీరంలోని కండరాలపై జీరో గ్రావిటీ వల్ల కలిగే ప్రభావాలను అధ్యయనం చేయడం, మానవ జీర్ణ వ్యవస్థ అంతరిక్షంలో ఎలా పనిచేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం వీడియో రూపొందించడం వంటి ప్రయోగాలను చేశారు. అంతేకాకుండా, వ్యోమగాముల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా పరిశోధనలు నిర్వహించారు.