Loading...
SIM Misuse: సిమ్‌ కార్డు విషయంలో కేంద్రం కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా
సిమ్‌ కార్డు విషయంలో కేంద్రం కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా

SIM Misuse: సిమ్‌ కార్డు విషయంలో కేంద్రం కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిమ్‌ కార్డుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. ఇతరుల అనుమతి లేకుండా వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించి మొబైల్‌ సిమ్‌ తీసుకోవడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, ఐఎంఈఐ నంబర్లను అక్రమంగా మార్చడం వంటి చర్యలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (డీఓటీ) స్పష్టం చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.

వివరాలు 

ఛత్తీస్‌గఢ్‌ ఘటనతో వెలుగులోకి..

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల బయటపడిన ఓ మోసం నేపథ్యంలో డీఓటీ ఈ హెచ్చరిక జారీ చేసింది.

అక్కడ ఓ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) ఏజెంట్‌.. సంబంధిత వ్యక్తులకు తెలియకుండా వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించి 25 సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు.

పీఓఎస్‌ ఏజెంట్‌పై చర్యలు..

ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే టెలికమ్యూనికేషన్స్‌ శాఖ, మొబైల్‌ సేవల సంస్థలతో కలిసి చర్యలు చేపట్టింది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంబంధిత పీఓఎస్‌ ఏజెంట్‌ను బ్లాక్‌ చేసింది.

అంతేకాకుండా ఇకపై అతడి దుకాణం నుంచి కొత్త మొబైల్‌ కనెక్షన్లు జారీ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించింది.

వివరాలు 

25 నంబర్లపై ప్రత్యేక పరిశీలన

సదరు ఏజెంట్‌ యాక్టివేట్‌ చేసిన 25 మొబైల్‌ నంబర్లను డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ (డీఐపీ) ద్వారా అధికారులు పరిశీలించారు.

అనుమానాస్పదంగా గుర్తించిన కనెక్షన్లకు మరోసారి ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టారు. సరైన ధ్రువీకరణ సమర్పించని సిమ్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సైబర్‌ నేరాల నేపథ్యంలో హెచ్చరిక

సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలకు టెలికాం వనరులను దుర్వినియోగం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో డీఓటీ ఈ హెచ్చరిక చేసింది.

ప్రజల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి సిమ్‌ కార్డులు తీసుకోవడం సహా టెలికాం సేవలను దుర్వినియోగం చేసే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.

అందువల్ల సిమ్‌ కార్డు తీసుకునే సమయంలో తమ గుర్తింపు పత్రాలు ఎలా ఉపయోగిస్తున్నారో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ADVERTISEMENT