Page Loader
Planetary Parade 2025: ఆకాశంలో మహాద్భుతం.. ఇవాళ ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలంటే?
ఆకాశంలో మహాద్భుతం.. ఇవాళ ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలంటే?

Planetary Parade 2025: ఆకాశంలో మహాద్భుతం.. ఇవాళ ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆకాశంలో దృశ్యాలు మనమంతా ఎప్పుడూ ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. నక్షత్రాలు, తోక చుక్కలు, గ్రహాలు, గ్రహ శకలాలు, ఈ అద్భుతాల పట్ల అందరూ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆసక్తిని కనబరుస్తారు. ఇవాళ (జనవరి 21) ఆకాశంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో భూమికి సమాంతరంగా కనిపించనున్నాయి. ఇది ఒక అరుదైన సంఘటన, శాస్త్రవేత్తలు దీన్ని "జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతం" అని పేర్కొంటున్నారు.

వివరాలు 

ఆరు గ్రహాల వరుస: 

ఈ అద్భుతంలో ఆకాశంలో ఆరు గ్రహాలు.. శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్, ఒకే వరుసలో కనబడతాయి. కానీ, నెప్ట్యూన్, యూరేనస్‌ను చూడాలంటే టెలిస్కోప్ ఉపయోగించడం తప్పనిసరిగా అవుతుంది. ఈ గ్రహాలు సూర్యుడికి ఒక వైపున అమరిపోతాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనిపించనుంది: జనవరి 21, ఫిబ్రవరి 2.

వివరాలు 

భారతదేశంలో ఈ అద్భుతాన్ని ఎలా చూడాలి? 

21 జనవరి 2025 నుండి ఈ గ్రహాల అమరిక భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ గ్రహాల పరేడ్ దాదాపు నాలుగు వారాలు ఆకాశంలో కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతారు. శాస్త్రవేత్తలు చెప్తున్నదాని ప్రకారం, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా కళ్లతో వీక్షించవచ్చు. అయితే, నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలను టెలిస్కోప్ ద్వారా మాత్రమే చూడవచ్చు.

వివరాలు 

స్పష్టంగా కనిపించడానికి ఉత్తమ సమయం: 

ఈ గ్రహాలు సూర్యాస్తమయ సమయంలో, సాయంత్రం 8:30 గంటల సమీపంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో ఈ అద్భుతం స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, కాంతి కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ గ్రహాల అమరిక స్పష్టంగా చూడవచ్చు.

వివరాలు 

గ్రహాల అమరిక సర్వసాధారణమా..?  

గ్రహాల అమరిక అనేది భూమి నుంచి ఒకే వరుసలో గ్రహాలు కనిపించే సంఘటన. ఈ అమరిక "గ్రహాల పరేడ్" అని పిలవబడుతుంది. ఈ అమరిక సూర్యునికి ఒక వైపున జరుగుతుంది. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం, ఇది అరుదుగా జరుగుతుందని వారు అన్నారు. ఆరు నుంచి ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన.