LOADING...
SnapChat: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై స్నాప్‌చాట్ ఫోకస్.. కొత్త సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి..
కొత్త సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి..

SnapChat: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై స్నాప్‌చాట్ ఫోకస్.. కొత్త సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా వేదికల్లో రోజురోజుకీ మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న సైబర్ ప్రమాదాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్‌ చాట్ కీలక అడుగు వేసింది. ముఖ్యంగా టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తమ 'ఫ్యామిలీ సెంటర్' ఫీచర్‌కు మరిన్ని కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా, డిజిటల్ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలపై పిల్లలు-తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన చర్చలు జరగాలనే లక్ష్యంతోనే ఈ మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

వివరాలు 

ఎవరితో తరచుగా టచ్‌లో ఉన్నారన్న వివరాలు తల్లిదండ్రులు తెలుసుకునే వీలు

కొత్త అప్‌డేట్‌లో భాగంగా, గత వారం రోజుల వ్యవధిలో తమ పిల్లలు ఎవరితో ఎక్కువగా చాటింగ్ చేశారన్నది, ఎవరితో తరచుగా టచ్‌లో ఉన్నారన్న వివరాలను తల్లిదండ్రులు తెలుసుకునే వీలు కల్పించారు. అయితే పిల్లల వ్యక్తిగత చాట్స్‌, వారు పంపుకున్న మెసేజ్‌ల కంటెంట్‌ను మాత్రం తల్లిదండ్రులు చూడలేరు. కేవలం వారు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారన్న కమ్యూనికేషన్ సరళి మాత్రమే కనిపిస్తుంది. దీని వల్ల పిల్లల ప్రైవసీకి భంగం కలగకుండా, అనుమానాస్పద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయా లేదా అన్న విషయాన్ని ముందుగానే గుర్తించే అవకాశం తల్లిదండ్రులకు లభిస్తుంది.

వివరాలు 

స్నాప్ మ్యాప్ ఫీచర్‌లో మరింత స్పష్టత

ఇక స్నాప్ మ్యాప్ ఫీచర్‌లో కూడా మరింత స్పష్టత తీసుకొచ్చారు. పిల్లలు తమ లైవ్ లొకేషన్‌ను ఏయే స్నేహితులతో షేర్ చేస్తున్నారన్న సమాచారాన్ని తల్లిదండ్రులు ఇప్పుడు చెక్ చేయవచ్చు. ఇది రియల్‌టైమ్‌లో పిల్లల కదలికలను ట్రాక్ చేయదు కానీ, లొకేషన్ షేరింగ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో ప్రైవసీని ఎలా కాపాడుకోవాలన్న విషయంపై పిల్లలకు సరైన సూచనలు ఇవ్వడానికి తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

తల్లిదండ్రులకు సేఫ్టీ అలర్ట్స్

అదేవిధంగా, ఏదైనా అసాధారణమైన లేదా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు తల్లిదండ్రులకు సేఫ్టీ అలర్ట్స్ కూడా అందేలా ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా ఆటోమేటెడ్‌గా చర్యలు తీసుకునే విధంగా కాకుండా, తల్లిదండ్రులను అప్రమత్తం చేసి పిల్లలతో మాట్లాడేలా ప్రోత్సహించే విధంగా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఫ్యామిలీ సెంటర్ ఫీచర్లను ఉపయోగించాలంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ స్నాప్‌చాట్ యాప్‌లో తమ అకౌంట్లను పరస్పరం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేఫ్టీ అప్‌డేట్స్‌ను దశలవారీగా యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

తల్లిదండ్రుల జాగ్రత్తలు, పర్యవేక్షణ కూడా ఎంతో కీలకం 

టీనేజర్లపై హానికరమైన కంటెంట్ ప్రభావం తగ్గించి, అపరిచితులతో అనవసర ఇంటరాక్షన్లను నియంత్రించే దిశగా స్నాప్‌చాట్ తీసుకున్న ఈ చర్యలను టెక్ నిపుణులు స్వాగతిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ భద్రత కేవలం టెక్నాలజీతోనే సాధ్యమయ్యేది కాదని, తల్లిదండ్రుల జాగ్రత్తలు, పర్యవేక్షణ కూడా ఎంతో కీలకమని స్నాప్‌చాట్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Advertisement