LOADING...
Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న 'జ్వాలా వలయం'.. ఎక్కడ, ఎలా చూడాలంటే?
ఫిబ్రవరి 17న 'జ్వాలా వలయం'.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న 'జ్వాలా వలయం'.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంకా కొన్ని రోజుల్లో ఆకాశంలో ఒక అపూర్వమైన, మనసును ఆకట్టుకునే ఖగోళ దృశ్యం దర్శనమివ్వనుంది. ఫిబ్రవరి 17న సంభవించబోయే కంకణాకార సూర్య గ్రహణం,సాధారణంగా "రింగ్ ఆఫ్ ఫైర్"గా పిలువబడే అరుదైన ఘటన ఇది. వలయాకారంలో మండుతున్న సూర్యకాంతి కనిపించే ఈ సూర్యగ్రహణం ఖగోళ శాస్త్ర పరంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాధారణంగా చంద్రుడు భూమి,సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా కొంతవరకు కప్పివేస్తాడు. ఫలితంగా భూమిపై సూర్యకాంతి తీవ్రత తగ్గి, సూర్యుడు కనబడకపోవచ్చు.కానీ ఈసారి చంద్రుడు భూమికి సాధారణం కంటే ఎక్కువ దూరంలో ఉండటంతో,సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేడని నాసా వెల్లడించింది.

వివరాలు 

మధ్యలో చీకటి వృత్తం, చుట్టూ వెలిగిపోతున్న అగ్ని కాంతి

అందువల్ల సూర్యుడి మధ్య భాగాన్ని చంద్రుని చీకటి వలయం కప్పేస్తే, అంచుల వద్ద మండుతున్న అగ్ని వలయం స్పష్టంగా దర్శనమిస్తుంది. మధ్యలో చీకటి వృత్తం, చుట్టూ వెలిగిపోతున్న అగ్ని కాంతి కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ కారణంగానే దీనిని "రింగ్ ఆఫ్ ఫైర్" లేదా "జ్వాలా వలయం"గా వ్యవహరిస్తారు. ఈ రకమైన గ్రహణాన్ని పెనుంబ్రల్ సూర్యగ్రహణంగా కూడా పేర్కొంటారు. ఇలాంటి ఖగోళ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని, కాబట్టి ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని వదులుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

వివరాలు 

పెనుంబ్రల్ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

పెనుంబ్రల్ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణానికి భిన్నంగా ఉంటుంది. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. ఆ సమయంలో భూమిపై సూర్యుడు కనిపించకపోవడంతో పగలు కూడా చీకటి వాతావరణాన్ని తలపిస్తుంది. సూర్యకాంతి పూర్తిగా ఆగిపోవడంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గినట్లు అనిపిస్తాయి. అయితే పాక్షిక సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేకపోతాడు. ఈసారి Space.com సమాచారం ప్రకారం,చంద్రుడు సూర్యుని కేంద్ర భాగాన్ని సుమారు 96 శాతం వరకు కప్పివేయనుంది. ఈ "రింగ్ ఆఫ్ ఫైర్" దృశ్యం గరిష్ఠంగా 2 నిమిషాలు 20 సెకన్లపాటు కొనసాగుతుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం,ఈ సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఉదయం 07:01 UTCకి ప్రారంభమవుతుంది. ఇది భారత కాలమానం ప్రకారం అదే రోజు మధ్యాహ్నం 12:31 గంటలకు సరిపోతుంది.

Advertisement

వివరాలు 

ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

ఈ కంకణాకార సూర్యగ్రహణం ప్రధానంగా అంటార్కిటికా ప్రాంతాల నుంచి "జ్వాలా వలయం" రూపంలో స్పష్టంగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా కాంకోర్డియా, మిర్నీ వంటి పరిశోధనా కేంద్రాల నుంచి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. అలాగే దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా,చిలీ ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. గ్రహణ మార్గం పూర్తిగా దక్షిణార్ధగోళంలోనే ఉండటంతో భారతదేశంలో ఇది ప్రత్యక్షంగా కనిపించదు. అయితే ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ ఖగోళ ఘటనను వీక్షించే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

సురక్షితంగా వీక్షించేందుకు జాగ్రత్తలు

సూర్యగ్రహణాన్ని చూస్తున్నప్పుడు కళ్ల రక్షణ అత్యంత అవసరం.సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ISO 12312-2 ప్రమాణాలతో కూడిన ప్రత్యేక "ఎక్లిప్స్ గ్లాసెస్"ను మాత్రమే ఉపయోగించాలి. అలాగే పిన్‌హోల్ ప్రొజెక్టర్,టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ల ద్వారా పరోక్షంగా పరిశీలించడం సురక్షిత మార్గం. పిల్లలకు ఈ గ్రహణాన్ని చూపించే ముందు వారికి తగిన సూచనలు ఇవ్వడం తప్పనిసరి. వీక్షణ పరికరాలను నమ్మకమైన, విశ్వసనీయ వనరుల నుంచే కొనుగోలు చేయాలి. ఈ రకమైన ఖగోళ సంఘటనలు విశ్వంలోని రహస్యాలను,ప్రకృతి శక్తి గొప్పతనాన్ని మనకు మరోసారి గుర్తుచేస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు,పరిశోధకులకు ఇది విలువైన అధ్యయన అవకాశం కాగా, సాధారణ ప్రజలకు మాత్రం ప్రకృతి అందాలను ఆస్వాదించే ఒక అపూర్వమైన సందర్భంగా చెప్పుకోవచ్చు.

Advertisement