Sunita Williams: స్పేస్ నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్
బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నవంబర్ 5న యూఎస్ లో జరిగే ఎన్నికల్లో అంతరిక్షం నుంచే తాము ఓటు వేయనున్నామని వారు వెల్లడించారు. సునీతా, విల్‌మోర్ ఫిబ్రవరి 2024 వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో, ఓటు హక్కు వినియోగించడం తమ కీలక కర్తవ్యం అని విల్‌మోర్ తెలిపారు.
అంతరిక్షం నుండి ఓటు వేయడం సంతోషంగా ఉంది
సునీతా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి నేను చాలా ఆనందంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. 1997 నుంచి నాసా వ్యోమగాములకు అంతరిక్షం నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఉపయోగిస్తారు. మొదట, ఈ బ్యాలెట్లను ప్రత్యేకంగా రూపొందించి ఐసీసీకి పంపిస్తారు. అక్కడ, వ్యోమగాములు తమ వివరాలను నమోదు చేసి మళ్లీ భూమికి పంపిస్తారు. ఎన్‌క్రిప్షన్ విధానంలో బ్యాలెట్లను భద్రంగా నాసా మిషన్ కంట్రోల్ సెంటర్‌కు పంపించి, అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల కౌంటీ క్లర్క్‌లకు పంపుతారు.