Russia Satellite: అంతరిక్షంలో అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన రష్యా!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో అమెరికా (USA), రష్యా (Russia) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రష్యాకు చెందిన సైనిక ఉపగ్రహం 'కాస్మోస్ 2612'.. అమెరికాకు చెందిన ICEYE-X36 నిఘా రాడార్ ఉపగ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో రష్యా ఉపగ్రహం అనూహ్యంగా వెనక్కి వెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ICEYE-X36 ఉపగ్రహం ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక నిఘా సమాచారం, చిత్రాలను అందిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యా సోయజ్ రాకెట్ ద్వారా ఆరు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. సైనిక శ్రేణి ఉపగ్రహాలకు పెట్టే 'కాస్మోస్' పేరుతో వీటికి 2609 నుంచి 2614 వరకు నంబర్లు కేటాయించింది. అయితే ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో కచ్చితంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తాయనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు.
వివరాలు
యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది
మరోవైపు, ICEYE సంస్థ పోలాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి అమెరికాలోనూ అనుబంధ సంస్థ ఉంది. ICEYE-X36ఉపగ్రహాన్ని అమెరికా ఉపగ్రహంగా నమోదు చేశారు.
2022 ఆగస్టులో తమ సంస్థ ఒక ఉపగ్రహాన్ని ఉక్రెయిన్‌కు బదిలీ చేసినట్లు ICEYEప్రకటించింది. అయితే, అది ఏ ఉపగ్రహమనే వివరాలను వెల్లడించలేదు.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇటీవల సెప్టెంబర్ 30న రష్యాకు చెందిన కాస్మోస్ 2612 ఉపగ్రహం తమ ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించడం ప్రారంభించిందని ICEYEఆందోళన వ్యక్తం చేసింది.
రష్యా ఉపగ్రహం తమ శాటిలైట్‌కు కొన్ని వందల మీటర్ల సమీపానికి చేరుకుందని తెలిపింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించిందని ఆరోపించింది. అంతేకాకుండా, ఆ ఉపగ్రహంలో ఆయుధాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
రెండు ఉపగ్రహాల మధ్య దూరం 250 మైళ్లు
అయితే, ఆదివారం రాత్రి నుంచి కాస్మోస్ 2612 క్రమంగా దూరంగా వెళ్లడం ప్రారంభించింది.
సోమవారం సాయంత్రానికి రెండు ఉపగ్రహాల మధ్య దూరం 250 మైళ్లకు చేరింది.
అయితే చివరి నిమిషంలో రష్యా ఉపగ్రహం ఎందుకు వెనక్కి వెళ్లిందనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.
ఇదిలా ఉండగా, రష్యాపై విధించిన కొన్ని ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొంతవరకు సడలించారు.
దాదాపు అదే సమయంలో రష్యా ఉపగ్రహం వెనక్కి వెళ్లడం ప్రారంభించడంతో ఈ రెండు పరిణామాల మధ్య సంబంధం ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.