LOADING...
Women's Day 2026: అంతరిక్షాన్ని జయించిన తొలి మహిళ.. వాలెంటీనా తెరిష్కోవా స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే!
అంతరిక్షాన్ని జయించిన తొలి మహిళ.. వాలెంటీనా తెరిష్కోవా స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే!

Women's Day 2026: అంతరిక్షాన్ని జయించిన తొలి మహిళ.. వాలెంటీనా తెరిష్కోవా స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో మనసును కదిలించే కొన్ని నిజ జీవిత కథలు మన ముందుకొస్తాయి. ముఖ్యంగా మహిళల ప్రతిభను, సాధనలను గుర్తుచేసుకునే ఇంటర్నేషన్ మహిళా దినోత్సవం (మార్చి 8) దగ్గరపడుతున్న వేళ అలాంటి కథలు మరింత స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి ప్రేరణాత్మక కథల్లో ఒకటి 'వాలెంటినా తెరిష్కోవా' జీవితం. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక యువతి తన కలల బలంతో భూమిని దాటి అంతరిక్షం వరకు చేరిన అసాధారణ గాథ ఇది. ఒకప్పుడు అందని ఆకాశంలా కనిపించిన లక్ష్యం ఆమె ధైర్యం ముందు తలవంచిన రోజు ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

Details

చిన్న గ్రామం నుంచి అంతరిక్షం వరకు

వాలెంటినా తెరిష్కోవా 1937 మార్చి 6న రష్యాలోని బోల్షోయే మస్లెన్నికోవో అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ట్రాక్టర్ నడిపే కార్మికుడు కాగా, తల్లి వస్త్ర పరిశ్రమలో పనిచేసే సాధారణ మహిళ. చిన్న వయసులోనే జీవితం ఆమెకు కఠినమైన అనుభవాలను చూపించింది. వరల్డ్ వార్ II సమయంలో ఆమె తండ్రి యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లిపై పడిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని చుట్టుముట్టాయి. చదువు కొనసాగించడం కూడా కష్టంగా మారింది. దీంతో చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. వస్త్ర పరిశ్రమలో పని చేస్తూనే జీవితం సాగించాల్సి వచ్చింది. అయితే ఆమె కలలు మాత్రం చిన్నవిగా మారలేదు. పని చేస్తూనే చదువును కొనసాగించాలని నిర్ణయించుకుంది.

Details

ఆకాశాన్ని తాకిన కల

యువతిలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె మనసును ఆకర్షించిన కొత్త ప్రపంచం ఆకాశం. విమానాలు, ఎగిరే ప్రపంచం ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ ఆసక్తి క్రమంగా స్కైడైవింగ్‌ వైపు తీసుకెళ్లింది. మొదటిసారి ఆకాశం నుంచి భూమివైపు దూకిన అనుభవం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణం ఆమెకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. భూమిపైనే కాదు, ఆకాశంలో కూడా మనిషి కలలు ఎగరగలవని ఆమెలో నమ్మకం పెరిగింది. అదే సమయంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మరో సంఘటన జరిగింది.

Advertisement

Detaiils

ఐదుగురు మహిళలు ఎంపిక

యూరి గగారిన్ అనే సోవియట్ వ్యోమగామి మానవ చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఆ ఘట్టం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ నేపథ్యంలో మహిళలను కూడా అంతరిక్ష కార్యక్రమాల్లో భాగం చేయాలనే ఆలోచన సోవియట్ నాయకత్వంలో మొదలైంది. వేలాది మంది మహిళలు ఆ అవకాశానికి దరఖాస్తు చేసుకున్నారు. కఠినమైన పరీక్షలు, శిక్షణల తరువాత చివరకు ఐదుగురు మహిళలను ఎంపిక చేశారు. ఆ ఐదుగురిలో వాలెంటినా తెరిష్కోవా కూడా ఒకరు.

Advertisement

Details

వోస్తోక్-6 చారిత్రక ప్రయాణం

1963 జూన్ 16 ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఆ రోజు వాలెంటినా తెరిష్కోవా Vostok‑6 అనే అంతరిక్ష నౌకలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భూమి నుంచి అంతరిక్షంలోకి ఆమె ప్రయాణించిన క్షణం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా గమనించింది. ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్లడం అప్పటివరకు ఎవ్వరూ ఊహించని విషయం. దాదాపు 2 రోజులు 23 గంటలు 12 నిమిషాలు ఆమె అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 48సార్లు పరిభ్రమించారు. అంతరిక్షంలో మహిళల శరీరంపై వచ్చే మార్పులను కూడా పరిశీలించారు. చివరకు 1963జూన్ 19న ఆమె సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. ఆ క్షణం నుంచి ఆమె పేరు చరిత్రలో ప్రత్యేక గుర్తింపును పొందింది. తొలిమహిళగా ప్రపంచం ఆమెను గౌరవంతో స్మరించడం ప్రారంభించింది.

Details

అంతరిక్ష యాత్ర తర్వాత

అంతరిక్ష ప్రయాణం తరువాత వాలెంటినా తెరిష్కోవా జీవితం మరో దిశలో కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక మహిళా సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. మహిళల హక్కులు, సమానత్వం, ప్రపంచ శాంతి వంటి అంశాలపై ఆమె తన స్వరాన్ని వినిపించారు. తరువాత రష్యా దేశ పార్లమెంట్ సభ్యురాలిగా కూడా సేవలందించారు. ఒక సాధారణ కార్మిక కుటుంబంలో పుట్టిన యువతి ప్రపంచ రాజకీయ వేదికలపై మాట్లాడే స్థాయికి ఎదగడం ఆమె జీవితం ఎంత గొప్ప ప్రయాణమో చూపిస్తుంది.

Details

పురస్కారాలు, గౌరవాలు

వాలెంటినా తెరిష్కోవా సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆమెకు సోవియట్ దేశ అత్యున్నత గౌరవమైన 'సోవియట్ యూనియన్ వీరురాలు' బిరుదు లభించింది. అలాగే 'లెనిన్ పతకం' సహా అనేక ప్రతిష్ఠాత్మక గౌరవాలు ఆమెకు దక్కాయి. ఆమె పేరును చంద్రుని వెనుక భాగంలో ఉన్న ఒక క్రేటర్‌కు కూడా పెట్టారు. ఇది ఆమె సాధనకు ప్రపంచం ఇచ్చిన గొప్ప గౌరవాలలో ఒకటి.

Details

మహిళలకు  స్ఫూర్తి

వాలెంటినా తెరిష్కోవా కథ కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు. అది సంకల్పం, ధైర్యం, కలల శక్తిని తెలియజేసే కథ. చిన్న గ్రామంలో పుట్టిన ఒక అమ్మాయి తన కలలను నమ్మితే ప్రపంచాన్ని కూడా మార్చగలదని ఆమె నిరూపించింది. మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలోనే ఆమె అంతరిక్షాన్ని తాకింది. అందుకే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కథ మరింత గొప్పగా వినిపిస్తుంది. ఆకాశం కూడా పరిమితి కాదని ప్రపంచానికి చెప్పిన మహిళగా వాలెంటీనా తెరిష్కోవా పేరు చరిత్రలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.

Advertisement