US start-up plans: చంద్రుడిపై హోటల్ నిర్మాణం.. 2032 నాటికి లూనార్ హోటల్ లక్ష్యంగా GRU స్పేస్
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడిపై త్వరలోనే హోటల్ ఏర్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ స్టార్ట్‌అప్ ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ స్టార్ట్‌అప్ గ్యాలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ (GRU Space), ప్రపంచంలోనే తొలి చంద్ర హోటల్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 2032 నాటికి అతిథులను స్వాగతించాలని సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సంపన్న అంతరిక్ష పర్యాటకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు GRU స్పేస్ తెలిపింది. ఒక్కో వ్యక్తి నుంచి 10 లక్షల డాలర్ల డిపాజిట్ తీసుకోనున్నారు. భూమి వెలుపల శాశ్వతంగా మనుషులు నిర్మించే తొలి నిర్మాణం ఇదేనని, చంద్రుడిపైకి వెళ్లే సందర్శకులకు ఇది వసతి కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.
వివరాలు
ఈ లోకానికి అందని విహారం
గత ఏడాది స్థాపితమైన ఈ స్టార్ట్‌అప్ వెనుక స్కైలర్ చాన్ ఉన్నారు. ఆయన కాలిఫోర్నియా యూనివర్సిటీ, బెర్క్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో సంబంధాలు ఉన్న ఇన్వెస్టర్లు, రక్షణ సాంకేతిక సంస్థ ఆండురిల్‌తో అనుబంధం ఉన్న పెట్టుబడిదారుల నుంచి GRU స్పేస్‌కు మద్దతు లభించినట్లు సమాచారం. అంతరిక్ష పర్యాటకమే చంద్రుడి ఆర్థిక వ్యవస్థకు దారి చూపుతుందని GRU స్పేస్ నమ్ముతోంది. ఇప్పటికే వాణిజ్య అంతరిక్ష ప్రయాణం చేసిన వారు, తొలిసారి సాహసయాత్రకు సిద్ధమయ్యే వారు, అలాగే ప్రత్యేక అనుభవం కోరుకునే హనీమూన్ జంటలు తమ లక్ష్య వినియోగదారులని సంస్థ చెబుతోంది. దీన్ని 'ఈ లోకానికి అందని విహారం'గా GRU వర్ణిస్తోంది.
వివరాలు
నిర్మాణంలో ఇన్‌ఫ్లేటబుల్ హ్యాబిటేషన్ మాడ్యూల్స్ ఉపయోగించనున్నారు
నిర్మాణం విషయంలో భూమిపై తయారుచేసిన ఇన్‌ఫ్లేటబుల్ హ్యాబిటేషన్ మాడ్యూల్స్ ఉపయోగించనున్నారు. వీటితో పాటు చంద్రుడి మట్టిని ఇటుకల లాంటి నిర్మాణ పదార్థంగా మార్చే ఆటోమేటెడ్ సిస్టమ్‌ను వినియోగించనున్నారు. దీంతో చంద్రుడిపై ఉన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే బలమైన ఆశ్రయాలు నిర్మించవచ్చని కంపెనీ చెబుతోంది. "మన జీవితకాలంలోనే మనం అంతర్‌గ్రహ జీవులుగా మారే కీలక మలుపులో ఉన్నాం. మేము విజయం సాధిస్తే, చంద్రుడు, అంగారక గ్రహాలపై కోట్లాది మంది మనుషులు జన్మించి అక్కడి అందాన్ని అనుభవించగలుగుతారు" అని స్కైలర్ చాన్ వ్యాఖ్యానించినట్లు స్పేస్.కామ్ తెలిపింది.
వివరాలు
చంద్రుడిపై ఉన్న మట్టిని ఇటుకలుగా మార్చే ప్రయోగాలు
2029 నాటికి చంద్రుడిపై తమ సాంకేతికతను పరీక్షించేందుకు GRU స్పేస్ సిద్ధమవుతోంది. నాసా నిర్వహిస్తున్న కామర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (CLPS) ప్రోగ్రామ్ కింద తొలి మిషన్‌లో చిన్న ఇన్‌ఫ్లేటబుల్ నిర్మాణాన్ని చంద్రుడిపై ఉంచి, హోటల్ కోసం వాడే పదార్థాల పనితీరును పరీక్షించనున్నారు. అదే మిషన్‌లో చంద్రుడిపై ఉన్న మట్టిని ఇటుకలుగా మార్చే ప్రయోగాలు కూడా చేస్తారు. వీటిని భవిష్యత్తులో హ్యాబిటేషన్‌ను తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్ నుంచి కాపాడేందుకు ఉపయోగించనున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, రెండో ప్రయోగంలో పెద్ద నిర్మాణాన్ని చంద్రుడిపై ఉన్న గుంతలో ఏర్పాటు చేయనున్నారు. అక్కడి పరిస్థితులు బహిరంగ ఉపరితలం కంటే స్థిరంగా ఉండే అవకాశముందని సంస్థ భావిస్తోంది.
వివరాలు
నలుగురు అతిథులు బస చేసేలా డిజైన్
2032నాటికి మూడో మిషన్‌లో తొలి పనిచేసే హోటల్‌ను చంద్రుడిపైకి పంపాలన్నది GRU స్పేస్ లక్ష్యం. ఇందులో ఒకేసారి నలుగురు అతిథులు బస చేసేలా డిజైన్ చేయనున్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ దశలవారీగా మరిన్నిఇన్‌ఫ్లేటబుల్ మాడ్యూల్స్‌ను జోడించి హోటల్‌ను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. లగ్జరీ టూరిజంతో ప్రారంభమై,భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత మానవ నివాసానికి దారి తీసే దీర్ఘకాలిక ప్రణాళికపై సంస్థ ఇప్పటికే ఒక వైట్ పేపర్‌ను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా,చంద్రుడిపైకి మనుషులను తిరిగి పంపే దిశగా నాసా కూడా తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఆర్టెమిస్-2 మిషన్‌ను త్వరలోనే,ఫిబ్రవరిలోనే నిర్వహించే అవకాశముండగా,ఆర్టెమిస్-3 మిషన్‌ను 2028లో చేపట్టి అపోలో కాలం తర్వాత తొలిసారి వ్యోమగాములను చంద్రుడిపై దిగేలా చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.