చంద్రయాన్-3 పై ఆశలు వదిలేసుకున్న ఇస్రో
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుమోసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే కనిపిస్తోంది. సెప్టెంబర్ 22న చంద్రుడిపై సుర్యోదయమైనప్పటికీ ల్యాండర్, రోవర్ లు ఇంకా మేల్కోవడం లేదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేస్తూ ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ చంద్రయాన్-3 ప్రాజెక్టుపై స్పందించారు. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు మేల్కోవడంపై ఇక ఆశలు కనిపించడం లేదని, చంద్రయాన్-3 కథ ముగిసినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో మరెన్నో కీలక పరిశోధనలు
చంద్రుడిపై సూర్యకాంతి ప్రసరించడం ఆగిపోవడం, రాత్రి సమయం ఆరంభం కావడం వల్ల ల్యాండర్, రోవర్‌లో అమర్చిన సోలార్ బ్యాటరీలు పూర్తిగా డెడ్ అయ్యాయి. వాటిని రీఛార్జ్ చేస్తే యాక్టివ్ అవుతాయని శాస్త్రవేత్తలు భావించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. రెండో రాత్రి సయం ఆరంభం కానున్న ఈ పరిస్థితుల్లో చంద్రయాన్ 3 పేలోడ్స్ ఇక ముందు పని చేసే అవకాశాలు లేవని, ఇప్పటికే చంద్రుడిపై పూర్తిస్థాయి పరిశోధనలకు అవసరమైన అనేక విషయాలను చంద్రయాన్ 3 పంపించిందని కిరణ్ కుమార్ వెల్లడించారు. భవిష్యత్తులో మరెన్నో కీలక పరిశోధనలకు ఈ డేటా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.