Thirty-Metre Telescope: గ్రహాంతర వాసులు కోసం అన్వేషణకు భారత్, జపాన్‌ల భారీ టెలిస్కోప్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివారమేనా?".. మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది. ఈ రహస్యానికి సమాధానం కనుగొనే ప్రయత్నంలో భారత్, జపాన్ కలిసి చరిత్రలో నిలిచే ఒక మహత్తర విజ్ఞాన ప్రాజెక్టును ప్రారంభించాయి. అదే 'థర్టీ మీటర్ టెలిస్కోప్' (Thirty Metre Telescope - TMT). బ్లాక్ హోల్స్ వెనుకున్న ఆగమేఘాల మర్మాలు తెలుసుకోవడం, దూర దూర అంతరిక్ష గెలాక్సీలను విశ్లేషించడం, ముఖ్యంగా భూమి వెలుపల జీవం ఉండే సూచనలను గుర్తించడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు.
వివరాలు
ఏమిటీ 'థర్టీ మీటర్ టెలిస్కోప్'?
పేరు చెబుతున్నట్లుగానే దీని ప్రాథమిక అద్దం వ్యాసం ఏకంగా 30 మీటర్లు. ప్రస్తుతం ఉన్న ఏ టెలిస్కోప్‌తో పోల్చినా ఇది గణనీయంగా పెద్దది. ప్రత్యేకత ఏమిటీ అంటే.. ఇది ఒక్క పెద్ద అద్దంతో పని చేయదు. సుమారు 500 చిన్న అద్దాలను (Segmented Mirrors) కలిపి ఒక భారీ అద్దంగా మారుస్తారు. దీని వల్ల విశ్వం అంచులనుంచి వచ్చే అతి స్వల్ప కాంతి కణాలనూ అందిపుచ్చుకుని అత్యంత స్పష్టమైన చిత్రాలను సేకరించగలదు.
వివరాలు
ఈ ప్రాజెక్టులో భారత పాత్ర ఎందుకు కీలకం?
ఈ మహా టెలిస్కోప్ నిర్మాణంలో భారత్ తీసుకున్న బాధ్యత అత్యంత ప్రధానమైనది. జపాన్ క్యాబినెట్ ఆఫీస్ వైస్ చైర్ డాక్టర్ సాకు సునేటా వెల్లడించిన వివరాల ప్రకారం.. 500 అద్దాలను ఒకే సమతలంలో, అత్యంత ఖచ్చితమైన కోణాలతో అమర్చడం ఒక పెద్ద ఇంజినీరింగ్ సవాలు. ఈ అద్దాల కదలికలను నియంత్రించే ఆప్టో-మెకానికల్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం భారత్ బాధ్యత. అంటే సాదాసీదాగా చెప్పాలంటే, ఈ టెలిస్కోప్ "కన్ను" ఎలా పనిచేయాలో నిర్ణయించేది భారత సాంకేతికతే. ఈ ప్రాజెక్టులో భారత్, జపాన్‌తో పాటు అమెరికాలోని రెండు ప్రముఖ వర్సిటీలు కూడా భాగస్వామ్య దేశాలే.
వివరాలు
గ్రహాంతర జీవుల కోసం అతి పెద్ద అన్వేషణ
ఈ టెలిస్కోప్ కేవలం నక్షత్రాలను పరిశీలించడానికి మాత్రమే కాదు; సూర్యుని దాటి ఉన్న ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఎక్స్‌ఓప్లానెట్ల వాతావరణాన్ని కూడా వివరిస్తుంది. వాటిలో నీటి ఆవిరి ఉందా? జీవం ఉనికిని సూచించే రసాయనాలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. ఒకవేళ నిజంగా గ్రహాంతర జీవుల గురించిన ఆనవాళ్లు దొరికితే, అది మానవ చరిత్రలోనే అతి గొప్ప మైలురాయి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. "దాన్ని కనిపెట్టిన వారికి నోబెల్ ప్రైజ్ ఖాయం" అని శాస్త్రవేత్తలు చమత్కరిస్తున్నారు.
వివరాలు
ఎక్కడ కడుతున్నారు?
మొదటి ఎంపిక హవాయిలోని మౌనా కియా పర్వతం (Mauna Kea). అక్కడి ఆకాశం పూర్తిగా స్వచ్ఛంగా ఉండటం, పరిశీలనలకు అనుకూల వాతావరణం ఉండటం దీని ప్రధాన కారణం. అయితే అక్కడి స్థానిక గిరిజనుల నిరసనల కారణంగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా భారత్‌లోని లద్దాఖ్ ప్రాంతంలోని హన్లే కూడ పరిశీలనలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2030 ప్రాంతంలో ఈ టెలిస్కోప్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే చంద్రుడిపై నీటి అన్వేషణ కోసం భారత్-జపాన్ కలిసి చేస్తున్న లూపెక్స్ (LUPEX) మిషన్ కూడా రెండు దేశాల శాస్త్రీయ సహకారానికి మంచి ఉదాహరణ.