Pancreatic Cancer: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగులకు ఆశాకిరణం.. జీవనకాలాన్ని రెట్టింపు చేస్తున్న కొత్త ఔషధం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. తాజాగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో 'డారాక్సోన్రాసిబ్' (Daraxonrasib) అనే ఔషధం రోగుల జీవనకాలాన్ని దాదాపు రెట్టింపు చేస్తుందని వెల్లడైంది. రోజుకు ఒక మాత్ర మాత్రమే తీసుకునే ఈ ఔషధం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలను అమెరికాలోని చికాగోలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ASCO) వార్షిక సమావేశంలో వెల్లడించారు.
వివరాలు
చికిత్స రంగాన్ని మార్చే స్థాయి ఫలితాలు
అధునాతన దశలో ఉన్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 500 మంది రోగులపై ఈ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. డారాక్సోన్రాసిబ్ తీసుకున్న రోగులు సగటున 13.2 నెలలు జీవించగా, సాధారణ కీమోథెరపీ పొందిన వారు కేవలం 6.6 నుంచి 6.7 నెలలు మాత్రమే జీవించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలను అరిజోనా యూనివర్సిటీ క్యాన్సర్ సెంటర్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ రచనా ష్రాఫ్ "చికిత్స రంగాన్ని మార్చే స్థాయి ఫలితాలు"గా అభివర్ణించారు. డారాక్సోన్రాసిబ్ ఔషధం శరీరంలో క్యాన్సర్ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉండే 'క్రాస్' (Kras) అనే ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటుంది.
వివరాలు
జీవనకాలాన్ని దాదాపు రెండింతలు చేసే అవకాశం
ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ డక్టల్ అడెనోకార్సినోమా (mPDAC) అనే సాధారణ రకం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల్లో 90శాతానికి పైగా క్రాస్ జన్యువులో మార్పులు ఉండటంతో ఈ ఔషధం వారికి మరింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనను యూకేకు చెందిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యాక్షన్ సంస్థ సీఈఓ పౌలా హాన్‌ఫోర్డ్ క్యాన్సర్ చికిత్స చరిత్రలో అత్యంత ముఖ్యమైన పురోగతుల్లో ఒకటిగా పేర్కొన్నారు. అధునాతన దశలో ఉన్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రోగుల జీవనకాలాన్ని దాదాపు రెండింతలు చేసే అవకాశం కనిపించడం ఎంతో ప్రోత్సాహకరమని,ఇది రోగులు,వారి కుటుంబాలకు కొత్త ఆశలను అందిస్తుందని ఆమె అన్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యూకే ప్రతినిధి అన్నాజువెల్ కూడా ఈ ఔషధం ప్రభావంపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు.