Loading...
'Blaze Star' : త్వరలో పేలనున్న బ్లేజ్ స్టార్.. భూమిపై నుంచి ఎప్పుడు చూడొచ్చంటే?
త్వరలో పేలనున్న బ్లేజ్ స్టార్.. భూమిపై నుంచి ఎప్పుడు చూడొచ్చంటే?

'Blaze Star' : త్వరలో పేలనున్న బ్లేజ్ స్టార్.. భూమిపై నుంచి ఎప్పుడు చూడొచ్చంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో మరో ఆసక్తికరమైన ఖగోళ ఘటనకు సమయం దగ్గరపడుతోంది. 'బ్లేజ్ స్టార్' (Blaze Star)గా పిలిచే T. Coronae Borealis నక్షత్ర వ్యవస్థలో త్వరలో భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో చెప్పడం మాత్రం కష్టంగా మారింది. ఈ నక్షత్ర వ్యవస్థలో రెండు నక్షత్రాలు ఉంటాయి. ఒకటి అత్యంత సాంద్రత కలిగిన తెల్ల మరుగుజ్జు నక్షత్రం (White Dwarf) కాగా, మరొకటి పరిమాణం పెరిగిన ఎర్ర రాక్షస నక్షత్రం (Red Giant). ఈ రెండు నక్షత్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండటంతో ఎర్ర రాక్షస నక్షత్రం నుంచి తెల్ల మరుగుజ్జు నక్షత్రం నిరంతరం వాయువులను,ఇతర పదార్థాలను తనవైపు లాగుతుంది.

వివరాలు 

త్వరలోనే పేలుడు.. కానీ కచ్చితమైన సమయం తెలియదు

ఇలా సుమారు 80 ఏళ్ల పాటు పదార్థం పేరుకుపోయి ఒక కీలక స్థాయికి చేరుకున్నప్పుడు నోవా (Nova) పేలుడు సంభవిస్తుంది.

ఈ ఘటన సమయంలో నక్షత్రం ప్రకాశం సాధారణ స్థాయి కంటే దాదాపు 1,000 రెట్లు పెరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ పాత స్థితికి చేరుకుంటుంది.

T. Coronae Borealis నక్షత్ర వ్యవస్థలో చివరిసారిగా 1946లో నోవా పేలుడు సంభవించింది.

సాధారణంగా సుమారు 80ఏళ్ల చక్రంతో ఈ ఘటన జరుగుతుండటంతో మరో పేలుడు సంభవించే సమయం దగ్గరపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే భూమి నుంచి ఈ పేలుడును ఎప్పుడు చూడగలమో కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారింది.

వివరాలు 

గత పేలుడుకు ముందు జరిగిన మార్పులపై పరిశీలన

తెల్ల మరుగుజ్జు నక్షత్రం తన సహచర నక్షత్రం నుంచి ఎంత వేగంగా వాయువులను,ఇతర పదార్థాలను సేకరిస్తుందనే అంశంపై పేలుడు సమయం ఆధారపడి ఉంటుంది.

ఈ ప్రక్రియలో అనేక అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త బ్రాడ్లీ షేఫర్ Space.comకు తెలిపారు.

T. Coronae Borealis ఎప్పుడు ప్రకాశవంతంగా మారుతుందో తెలుసుకునేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఇందుకోసం ప్రస్తుతం ఈ నక్షత్ర వ్యవస్థలో కనిపిస్తున్న కాంతి మార్పులను 1946లో పేలుడుకు ముందు నమోదైన వివరాలతో పోల్చి చూస్తున్నారు.

గతంలోనూ ఈ నక్షత్ర వ్యవస్థలో కాంతి తగ్గడం,పెరగడం వంటి మార్పులు కనిపించాయి.

దీంతో పేలుడు త్వరలోనే సంభవిస్తుందని శాస్త్రవేత్తలు భావించినప్పటికీ, అవి అసలు పేలుడుకు దారితీయలేదు.

ADVERTISEMENT

వివరాలు 

ఎర్ర రాక్షస నక్షత్రం ప్రకాశంతో అంచనాలకు ఇబ్బందులు

నాసా (NASA) ఆస్ట్రోపార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ చీఫ్ ఎలిజబెత్ హేస్ ఈ విషయాన్ని Space.comకు వెల్లడించారు.

T. Coronae Borealis వ్యవస్థలోని ఎర్ర రాక్షస నక్షత్రం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.

దీంతో దాని పక్కనే ఉన్న తెల్ల మరుగుజ్జు నక్షత్రాన్ని స్పష్టంగా పరిశీలించడం కష్టమవుతోంది.

ఫలితంగా తెల్ల మరుగుజ్జు నక్షత్రం ఉపరితలానికి సమీపంలో పేరుకుపోతున్న పదార్థాల ఉష్ణోగ్రత, పీడనాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.

నోవా పేలుళ్లను ముందుగానే అంచనా వేయడాన్ని వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంతో ఎలిజబెత్ హేస్ పోల్చారు.

తుఫాను రావడానికి అవసరమైన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అది ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమని ఆమె వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పేలుడుపై నిఘా పెట్టిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు

T. Coronae Borealisలో నోవా పేలుడు సంభవించినప్పుడు వెలువడే కాంతి భూమిని చేరే వరకు ఎలాంటి ముందస్తు దృశ్య హెచ్చరిక ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే ఎక్స్‌రే (X-ray) కిరణాల పరిధిలో ముందుగానే ఓ కాంతి మెరుపు కనిపించే అవకాశం ఉందని ఎలిజబెత్ హేస్ తెలిపారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్ర వ్యవస్థపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు.

ప్రతి ఒకటి లేదా రెండు నిమిషాలకు ఒకసారి దీన్ని పరిశీలిస్తూ కాంతిలో వచ్చే మార్పులను నమోదు చేస్తున్నారు.

ఈ విషయంలో వారు అద్భుతమైన పని చేస్తున్నారని బ్రాడ్లీ షేఫర్ పేర్కొన్నారు.

ADVERTISEMENT