YouTube search: యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ గందరగోళానికి చెక్! కొత్త ఫిల్టర్లు వచ్చాయి..
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్ సెర్చ్‌లో షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ యూజర్లను ఇబ్బంది పెట్టే సమస్యకు చివరకు పరిష్కారం దొరికింది. యూట్యూబ్ తన సెర్చ్ ఫిల్టర్లను అప్‌డేట్ చేస్తూ, యూజర్లు ప్రత్యేకంగా షార్ట్స్ లేదా లాంగ్-ఫామ్ వీడియోలను మాత్రమే చూసే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు సెర్చ్ చేస్తే షార్ట్స్, పొడవైన వీడియోలు కలిసిపోయి రావడం వల్ల అసహనం వ్యక్తమవుతుండేది. కొత్త మార్పులతో "Videos" అనే ఆప్షన్ ఎంచుకుంటే కేవలం లాంగ్-ఫామ్ వీడియోలే కనిపిస్తాయి. అలాగే "Shorts" ఎంపిక చేస్తే షార్ట్స్ మాత్రమే చూపిస్తాయి.
వివరాలు
పనితీరు తక్కువగా ఉన్న సెర్చ్ ఫిల్టర్‌లను తొలగించనున్న యూట్యూబ్
అదే సమయంలో, యూట్యూబ్ పనికిరాని కొన్ని సెర్చ్ ఫిల్టర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. "Upload Date - Last Hour","Sort by Rating" అనే ఫిల్టర్లు ఆశించిన విధంగా పనిచేయకపోవడంతో పాటు యూజర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో వాటిని తీసివేసినట్లు సంస్థ తెలిపింది. అయితే "Today", "This Week", "This Month", "This Year" వంటి ఇతర అప్‌లోడ్ డేట్ ఫిల్టర్లు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
వివరాలు
వీడియో సెర్చ్ కోసం యూట్యూబ్ 'పాపులారిటీ' ఫిల్టర్
వీడియోలను సులభంగా కనుగొనేలా చేయడానికి యూట్యూబ్ కొత్తగా "Popularity" అనే ఫిల్టర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటివరకు ఉన్న "View Count" సార్టింగ్ ఆప్షన్‌కు బదులుగా పనిచేస్తుంది. వీడియోకు వచ్చిన వ్యూస్‌తో పాటు వాచ్ టైమ్ వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ సెర్చ్‌కు సంబంధించి వీడియో ఎంత ప్రజాదరణ పొందిందో అంచనా వేస్తుందని యూట్యూబ్ వివరించింది. దీని ద్వారా యూజర్లకు సరైన వీడియోలు త్వరగా దొరికే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది.
వివరాలు
"Sort By" మెనూను "Prioritize"గా రీబ్రాండ్ చేసిన యూట్యూబ్
ఇంకో మార్పులో భాగంగా, సెర్చ్ ఫిల్టర్లలో ఉన్న "Sort By" మెనూను యూట్యూబ్ "Prioritize"గా రీబ్రాండ్ చేసింది. ఈ కొత్త పేరు, మెరుగుపరిచిన సార్టింగ్ విధానం యూజర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మొత్తం మీద, యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం, వీడియో డిస్కవరీని మరింత సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.