Government Apps: ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవే.. ఆ సమస్యలకు చెక్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు, చేతిలో ఉన్న చిన్న ప్రభుత్వ కార్యాలయంలా మారింది. ఒకప్పుడు చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. చాలాసార్లు మధ్యవర్తుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చేది. కానీ డిజిటల్ ఇండియా కార్యక్రమంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ సేవలు నేరుగా, వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయి. అందులో ముఖ్యంగా ఐదు మొబైల్ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వివరాలు
ఆధార్ లేకపోతే ఇది చూపించొచ్చు..
ఎం-ఆధార్: మన దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం ఆధార్ కార్డు. ఎం-ఆధార్ యాప్ ద్వారా మీ మొబైల్‌నే డిజిటల్ ఆధార్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో భౌతిక కార్డు లేకపోయినా ఈ యాప్‌లోని ఆధార్ చూపించవచ్చు. డిజిలాకర్: పత్రాలను సురక్షితంగా భద్రపరచుకోవడానికి డిజిలాకర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది క్లౌడ్ ఆధారిత వేదిక. ఇందులో పదో తరగతి మెమో నుంచి ఇన్సూరెన్స్ పత్రాల వరకు అన్ని డాక్యుమెంట్లను నిల్వ చేసుకోవచ్చు. ఐటీ చట్టం ప్రకారం ఇందులో ఉన్న పత్రాలకు అసలు పత్రాలకున్న చట్టబద్ధతే ఉంటుంది. అందువల్ల పత్రాలు పోతాయేమో, చిరిగిపోతాయేమో అనే భయం ఉండదు.
వివరాలు
ఉద్యోగులకు ఇవి మరింత ముఖ్యం..
ఉమాంగ్: యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనే పేరుతో రూపొందిన ఉమాంగ్ యాప్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను ఒకే చోట అందిస్తుంది. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా చూసుకోవచ్చు. రైతులు కిసాన్ సువిధ వంటి సేవల ద్వారా వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. స్థానిక భాషల్లో కూడా అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రజలకు ఇది మరింత ఉపయోగకరంగా మారింది. ఎం-పరివాహన్: రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్ వాహనదారులకు చాలా అవసరం. ఇందులో వాహనం ఆర్‌సి, ఇన్సూరెన్స్ గడువు, ఫిట్‌నెస్ వివరాలు తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించిన చలాన్లను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.
వివరాలు
మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు..
భీమ్: నగదు రహిత లావాదేవీల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి భీమ్ యాప్ ప్రధాన కారణాల్లో ఒకటి. మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా డబ్బులు పంపించవచ్చు. బ్యాంక్ ఖాతా వివరాలు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పనిచేసేలా దీన్ని రూపొందించడం విశేషం. ఈ యాప్‌ల వలన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. మధ్యవర్తులు లేకుండా సేవలు నేరుగా ప్రజలకు అందడం వల్ల పారదర్శకత కూడా పెరుగుతుంది.