UIDAI Big Aadhaar Update: నవంబర్ 1 నుండి ఆధార్‌లో భారీ మార్పులు.. ఇక కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ కార్డుదారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక శుభవార్త ప్రకటించింది. నవంబర్ 1 నుండి ఆధార్ వివరాల అప్‌డేట్ విధానంలో భారీ మార్పులు అమలులోకి రానున్నాయి. ఇకపై పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండా, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా, అలాగే సురక్షితంగా మార్చడమే ఈ కొత్త డిజిటల్ విధానం ప్రధాన లక్ష్యం.
వివరాలు
పెరిగిన అప్‌డేట్ చార్జీలు
2025 సంవత్సరం ఆధార్ వ్యవస్థలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ ఏడాది UIDAI పలు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. ఫీజుల పెంపు: అక్టోబర్ 1 నుండి ఆధార్ అప్‌డేట్ ఫీజులు కొంచెం పెరిగాయి. ఇప్పుడు పేరు లేదా చిరునామా మార్పు వంటి చిన్న అప్‌డేట్స్‌కి రూ.75,బయోమెట్రిక్ మార్పుల కోసం రూ. 125 చెల్లించాలి. పిల్లలకు ఉచితం: 7 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్స్ (ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ మొదలైనవి) కోసం ఎటువంటి చార్జీలు ఉండవు. UIDAI ఈ సేవను ఉచితంగా అందిస్తోంది. ఒక ఆధార్-ఒక వ్యక్తి: నకిలీ లేదా ద్వంద్వ ఆధార్ కార్డులు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI స్పష్టం చేసింది.
వివరాలు
నవంబర్ 1 నుండి పూర్తి డిజిటల్ అప్‌డేట్
ఉచిత గడువు ముగింపు: ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం జూన్ 14తో ముగిసింది. ఇకపై ప్రతి అప్‌డేట్‌కి నిర్దిష్ట ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న ప్రధాన మార్పు ఏమిటంటే.. ఆధార్ జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ఈ మార్పుతో గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల ప్రజలు ఆధార్ సేవా కేంద్రాల వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పించుకోగలరు. ఇంటి నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి జనాభా వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందే.