ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?
ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్) లో కొత్త కొత్త ఫీఛర్స్ అందుబాటులోకి రానున్నాయి. ట్విట్టర్ పేరుతో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ లాగా ఉన్న యాప్ ని పూర్తిగా మార్చివేసి, అన్ని సౌకర్యాలు అందించే యాప్ గా మార్చబోతున్నారు. ఈ క్రమంలో ఎక్స్ ద్వారా వీడియో కాల్స్, డిజిటల్ చెల్లింపులు చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. ఈ విషయమై ట్విట్టర్ సీఈవో లిండా యాకరినో మాట్లాడుతూ, ఎక్స్ లో వీడియో కాల్, డిజిటల్ చెల్లింపులను మరికొద్ది రోజుల్లోనే తీసుకొస్తామని ఆమె ప్రకటించింది.
వీడియో కాల్స్ కి ఫోన్ నంబర్ అవసరం లేదు
లిండా యాకరినో పంచుకున్న విషయాల ప్రకారం, ఎక్స్ లో వీడియో కాల్స్ చేయడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు. మీరు డైరెక్టుగా కాల్ చేసేయవచ్చు. ఇక పేమెంట్స్ విషయానికి వస్తే, యుజర్లు తాము ఎవరికైతే పేమెంట్ చేయాలనుకున్నారో వారికి చేసేయవచ్చు. అలాగే ఎక్స్ లో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా పేమెంట్స్ చేయవచ్చు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, పేమెంట్స్ విషయంలో తన ఆలోచనలను పంచుకున్నాడు. ఎక్స్ లో సేవింగ్స్ అకౌంట్స్ ని పరిచయం చేయాలని ఎలాన్ మస్క్ అనుకుంటున్నారట. ఈ సేవింగ్స్ అకౌంట్స్ తీసుకున్నవారికి అత్యధిక మొత్తంలో వడ్డీ చెల్లించనున్నారట.