China Virus: చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్.. మెదడుపై ప్రభావం
చైనాలో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్‌ల్యాండ్ వైరస్ (WELV)ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ కొన్ని సందర్భాల్లో నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని వారు గుర్తించారు. ఈ వైరస్‌ను తొలిసారి 2019లో చైనాలోని జిన్‌జువో నగరంలో 61 ఏళ్ల వ్యక్తిలో గుర్తించారు. అయన మంగోలియాలోని చిత్తడి నేలల్లో నివసించే వ్యక్తి, పరాన్నజీవి కుట్టడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఐదు రోజుల పాటు కనిపించాయి. పరిశోధకులు వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతంలోని 14,600 జీవులను సేకరించి అధ్యయనం చేశారు.
పురుగుల కాటుకు గురైన 20 మంది బాధితులలో పాజిటివ్ నిర్ధారణ
ఈ అధ్యయనంలో, సేకరించిన పరాన్నజీవుల్లో 2% డబ్ల్యూఎల్‌వీ జన్యు పదార్థం ఉందని గుర్తించారు. ఆ ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను పరీక్షించగా, 12 మందిలో ఈ వైరస్ కనిపించింది. పురుగుల కాటుకు గురైన 20 మంది బాధితులలో పాజిటివ్ నిర్ధారణ జరిగింది.చికిత్స తర్వాత రోగులందరూ కోలుకున్నప్పటికీ..ఈ వైరస్ నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపడంతోపాటు ప్రమాదకర ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకలపై చేసిన ప్రయోగాలు వెల్లడించాయి.
గుర్రాలు,పందులు, గొర్రెల్లో ఈ డబ్ల్యూఎల్‌వీ ఆర్‌ఎన్‌ఏ
వెట్‌ల్యాండ్ వైరస్ మానవుల్లో తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపులోని ఒకటి. పరాన్నజీవులు దీన్ని వ్యాపింపజేస్తాయి. గుర్రాలు,పందులు, గొర్రెల్లో కూడా ఈ డబ్ల్యూఎల్‌వీ ఆర్‌ఎన్‌ఏను గుర్తించినట్లు తెలిపారు. ఈ వైరస్ జంతువుల రక్తనాళాల్లో మార్పులు కలిగించి ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తాజా అధ్యయనానికి సంబంధించిన నివేదిక ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది.