NemBharat : డ్రైవర్లకు జీరో కమిషన్.. ప్రయాణికులకు నో సర్జ్.. నెమ్ భారత్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో రైడ్ బుకింగ్ రంగంలో మరో పెద్ద మార్పు రాబోతుందా అన్న చర్చ మొదలైంది. భారత్ టాక్సీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే 'నెమ్ భారత్' అనే కొత్త రైడ్ బుకింగ్ ప్లాట్‌ఫాం ఎంట్రీకి సిద్ధమవుతోంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోమని, ప్రయాణికులపై సర్జ్ ప్రైసింగ్ ఉండదని ఈ సంస్థ ప్రకటించడంతో, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఉబెర్, ఓలా, రాపిడోలకు ఇది నేరుగా పోటీగా మారనుంది. వరల్డ్ ఎకనామిక్ మొబిలిటీ లిమిటెడ్ (WEML) వెల్లడించిన వివరాల ప్రకారం, నెమ్ భారత్‌ను నారాయణిహితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రీపెయిడ్, క్యాష్‌లెస్ విధానంలో నడపనున్నారు. గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం ఉండడం లేదన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ రూపొందించామని సంస్థ చెబుతోంది.
వివరాలు
కాబ్‌లు, ఆటోలు, బైక్ టాక్సీలు వంటి సేవలు అందుబాటులోకి..
ఇతర యాప్‌లలా ప్రతి రైడ్‌పై కమిషన్, సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేదా పర్సెంటేజ్ కోత ఉండదని, డ్రైవర్లు సంపాదించిన మొత్తం వారికే పూర్తిగా అందుతుందని స్పష్టం చేసింది. అలాగే పీక్ అవర్స్‌లో కూడా ధరలు పెరగవని, సర్జ్ ప్రైసింగ్ పూర్తిగా తొలగిస్తామని తెలిపింది. కాబ్‌లు, ఆటోలు, బైక్ టాక్సీలు వంటి సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రారంభ దశలో ఏ నగరాల్లో మొదలు పెడతారన్నది ఇంకా ప్రకటించలేదు గానీ, దేశవ్యాప్తంగా ఒక జాతీయ రవాణా నెట్‌వర్క్‌గా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
వివరాలు
'సారథి హీ మాలిక్' నినాదంతో భారత్ టాక్సీ
ఇదిలా ఉంటే, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మద్దతుతో 'సారథి హీ మాలిక్' నినాదంతో వచ్చిన భారత్ టాక్సీ ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో 80-20 రెవెన్యూ షేరింగ్ మోడల్‌తో పనిచేస్తోంది. ఆ మోడల్‌కు భిన్నంగా, నెమ్ భారత్ జీరో కమిషన్, నో సర్జ్ విధానంతో రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే ఉబెర్, ఓలా ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో నెమ్ భారత్ ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి. అధికారిక ప్రారంభ తేదీ ప్రకటించేవరకు పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.