WhatsApp: కేంద్రం కొత్త నిబంధనలు: భారత్‌లో వాట్సాప్ భవితవ్యంపై అనిశ్చితి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రభుత్వ నియంత్రణలు కఠినమవుతున్న నేపథ్యంలో మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భవితవ్యం అనిశ్చితిలో పడింది. వినియోగదారులు, వ్యాపార సంస్థలు యాప్‌ను ఉపయోగించే విధానంలో మార్పులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. యాప్ ఖాతాలు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ కార్డ్‌తో అనుసంధానంగా ఉండాలని, వివిధ డివైస్‌లలో పనిచేసే తీరుపై కఠిన నియంత్రణలు ఉండాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. ఈ కొత్త మార్గదర్శకాల వెనుక ప్రధాన ఉద్దేశ్యం సైబర్ మోసాలను అడ్డుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఫిషింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, లోన్ స్కామ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని టెలికాం శాఖ తెలిపింది.
వివరాలు
ఇలా చేస్తే మోసాలకు ఉపయోగించే నంబర్లను సులభంగా గుర్తించవచ్చు
"సిమ్-డివైస్ అనుసంధానం నిరంతరం కొనసాగడం, తరచూ లాగ్‌అవుట్ చేయడం వల్ల ప్రతి యాక్టివ్ ఖాతా కేవైసీ చేసిన సజీవ సిమ్‌తోనే ఉండేలా అవుతుంది" అని అధికారులు వివరించారు. ఇలా చేస్తే మోసాలకు ఉపయోగించే నంబర్లను సులభంగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిబంధనలపై డిజిటల్ హక్కుల సంఘాలు, పాలసీ నిపుణులు, పెద్ద డిజిటల్ కంపెనీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అధిక నియంత్రణకు దారి తీసే అవకాశం ఉందని, వాట్సాప్ లాంటి యాప్‌లను చట్టబద్ధంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇబ్బందులు కలగవచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత కమ్యూనికేషన్‌తో పాటు చిన్న వ్యాపారాలకు కూడా వాట్సాప్ కీలకమైన దేశంలో ఈ మార్పులు గందరగోళాన్ని సృష్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన 90 రోజుల్లో అమలు
ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన 90 రోజుల్లో అమలు చేయాల్సి ఉంటుంది. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్,సిగ్నల్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లన్నీ దీనికి లోబడాల్సి ఉంటుంది. యాప్‌లో నమోదు చేసిన సిమ్‌కే ఖాతా అనుసంధానంగా ఉండాలి. అలాగే వెబ్,డెస్క్‌టాప్ వెర్షన్లలో ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగ్‌అవుట్ అయి, మళ్లీ క్యూ ఆర్ కోడ్ ద్వారా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా వాట్సాప్‌పైనే పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్‌లోనే ఈ యాప్‌కు 50 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. నవంబర్ నెలలో నెలవారీ యాక్టివ్ యూజర్లలో 94 శాతం మంది రోజూ యాప్‌ను ఓపెన్ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
వివరాలు
చిన్న వ్యాపారాలపై ఈ నిబంధనల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా
అమెరికాలో మాత్రం ఈ సంఖ్య 59 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. అంటే భారతీయుల రోజువారీ జీవితంలో వాట్సాప్ ఎంతగా భాగమైందో ఇది చూపిస్తోంది. ప్రత్యేకంగా చిన్న వ్యాపారాలపై ఈ నిబంధనల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. చాలామంది చిన్న వ్యాపారులు ఒక ఫోన్‌లో సిమ్‌తో వాట్సాప్ బిజినెస్ ఖాతాను నమోదు చేసి, మరో డివైస్‌లో వెబ్ లేదా డెస్క్‌టాప్ ద్వారా కస్టమర్లతో మాట్లాడతారు. ఇప్పుడు సిమ్ బైండింగ్ తప్పనిసరి కావడం, తరచూ లాగ్‌అవుట్‌లు జరగడం వల్ల ఆర్డర్‌లు తీసుకోవడం, కస్టమర్ సపోర్ట్, రోజువారీ పనుల్లో అంతరాయం కలగవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.
వివరాలు
వాట్సాప్ తన వృద్ధి వ్యూహంలో కూడా మార్పులు
ఇదే సమయంలో వాట్సాప్ తన వృద్ధి వ్యూహంలో కూడా మార్పులు చేసుకుంటోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించడం కంటే ఇప్పటికే ఉన్నవారిని నిలుపుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. సెన్సర్ టవర్ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో భారత్‌లో మొబైల్ డివైస్‌లపై నెలవారీ యాక్టివ్ యూజర్లు ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగారు. అయితే డౌన్‌లోడ్స్ మాత్రం దాదాపు 49 శాతం తగ్గాయి. అంటే వేగంగా విస్తరించడంకన్నా యూజర్ రిటెన్షన్‌నే వాట్సాప్ ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది.