LOADING...
WhatsApp Prepaid Recharge: వాట్సాప్‌లోనే ప్రీపెయిడ్ రీచార్జ్ సౌకర్యం.. జియో, ఎయిర్టెల్, వి వినియోగదారులకు కొత్త ఫీచర్
జియో, ఎయిర్టెల్, వి వినియోగదారులకు కొత్త ఫీచర్

WhatsApp Prepaid Recharge: వాట్సాప్‌లోనే ప్రీపెయిడ్ రీచార్జ్ సౌకర్యం.. జియో, ఎయిర్టెల్, వి వినియోగదారులకు కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్‌లను నేరుగా యాప్‌లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందిస్తున్నారు. వచ్చే కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సేవను పేయూ ఆధారంగా తీసుకొచ్చారు. మెసేజింగ్‌కే పరిమితమైన వాట్సాప్‌ను రోజువారీ డిజిటల్ సేవల దిశగా విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌కే కాకుండా కుటుంబ సభ్యులు,స్నేహితుల నంబర్లకు కూడా రీచార్జ్ చేయవచ్చు. జియో,ఎయిర్టెల్,వోడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సేవలకు ఇది పనిచేస్తుంది. అందుబాటులో ఉన్న ప్లాన్‌లను చూసి, తగినది ఎంచుకుని, యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు.

వివరాలు 

హోమ్‌స్క్రీన్‌లో రూపీ సింబల్

దీంతో పాటు రూపీ సింబల్‌ను కూడా హోమ్‌స్క్రీన్‌లో కనిపించేట్లు వాట్సప్‌ అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్‌లో మొబైల్‌ రీఛార్జి చేయాలంటే తొలుత రూపీసింబల్‌పై క్లిక్‌ చేయాలి. ఈ గుర్తుపై క్లిక్ చేస్తే యూపీఐ చెల్లింపులు, మెట్రో టికెట్ సేవలు, చాట్‌లోనే డబ్బు పంపే సదుపాయం వంటి ఫీచర్లు సులభంగా అందుబాటులోకి వస్తాయి. రీచార్జ్ చేయడానికి ముందుగా రూపాయి గుర్తుపై నొక్కి, ప్రీపెయిడ్ రీచార్జ్ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్ ఎంపిక చేసి,టెలికాం ఆపరేటర్‌ను నిర్ధారించి,ప్లాన్‌ను ఎంచుకుని,చెల్లింపు విధానాన్ని ఎంపిక చేసి లావాదేవీ పూర్తి చేయాలి. ఇప్పటికే బిల్ చెల్లింపులు,మెట్రో టికెట్లు,ప్రభుత్వ సేవలు వంటి అనేక సౌకర్యాలను అందిస్తున్న వాట్సాప్.. ఇప్పుడు ప్రీపెయిడ్ రీచార్జ్‌లను కూడా కలిపి మరింత సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫారంగా మారుతోంది.

Advertisement