WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మొబైల్ నెంబర్ కనిపించకుండా కొత్త ఫీచర్ ..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో వినూత్న ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లలో ఉన్న విధంగా యూజర్‌నేమ్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని త్వరలో వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉండగా, వివిధ మొబైల్ పరికరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
వివరాలు
యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్..
ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఇతరులకు చూపించకుండా గోప్యంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. చాట్‌లలో ఫోన్ నెంబర్ స్థానంలో కేవలం యూజర్‌నేమ్ మాత్రమే కనిపిస్తుంది. దీంతో సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడంలో ఇది ఉపయోగపడుతుందని వాట్సాప్ భావిస్తోంది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు.
వివరాలు
యూజర్లకు ప్రత్యేక నోటిఫికేషన్..
ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇంకా బీటా టెస్టర్లకు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే రాబోయే రోజుల్లో దీనిని దశలవారీగా అందించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా చాట్ సెక్షన్‌లో కేవలం యూజర్‌నేమ్ మాత్రమే కనిపించడంతో మొబైల్ నెంబర్ గోప్యంగా ఉంటుంది. యూజర్‌నేమ్ ఎంపికకు కొన్ని నియమాలు కూడా ఉండనున్నాయి. కనీసం ఒక అక్షరం తప్పనిసరిగా ఉండాలి. అలాగే "www" తో ప్రారంభమయ్యే పేర్లను అనుమతించరు. చిన్న అక్షరాలు (a-z), సంఖ్యలు (0-9), డాట్‌లు, అండర్‌స్కోర్‌లను మాత్రమే ఉపయోగించేలా వాట్సాప్ సిస్టమ్‌ను రూపొందిస్తోంది. దీంతో ఒకేలా కనిపించే ఖాతాల వల్ల గందరగోళం తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది.
వివరాలు
వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు..
వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఫేస్‌బుక్ మెసెంజర్ తరహాలో ప్రస్తుతం ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఒకేచోట చూసే అవకాశం కల్పించనుంది. ఇప్పటి వరకు ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో తెలుసుకోవాలంటే వారి చాట్‌ను ఓపెన్ చేయాల్సి వచ్చేది. చాట్ తెరిచిన తర్వాత మాత్రమే వారు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నారా లేదా చివరిసారిగా ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చారనే సమాచారం కనిపించేది. అయితే కొత్త అప్‌డేట్ తర్వాత చాట్ ఓపెన్ చేయకుండానే ఆన్‌లైన్‌లో ఉన్న యూజర్ల వివరాలను ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేసిన యూజర్ల వివరాలు మాత్రం మునుపటిలాగే కనిపించవు. ఈ ఫీచర్ కూడా త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని సమాచారం.