WhatsApp: త్వరలో వాట్సప్ యాప్ లోనూ ట్రూ కాలర్ సేవలు
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ త్వరలో తన సేవలను మేసేజింగ్ యాప్ వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ లో వచ్చే స్పామ్/స్కామ్ కాల్స్ గుర్తించేందుకు త్వరలో ఈ అదనపు సర్వీస్ ను వాట్సాప్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ట్రూకాలర్ సీఈఓ అలన్ మమేది ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ను మే తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఏదైనా అన్ నౌన్ నంబర్ నుంచి కాల్ వస్తే ఆ నెంబర్ ను ట్రూకాలర్ ఐడెంటిఫికేషన్ చేస్తుంది.
ఇంటర్నేషన్ నెంబర్ల సాయం మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ నివేదిక ప్రకారం భారత్ వంటి దేశాల్లో సగటున ఒక యూజర్ కు రోజులో 17 టెలిమార్కెటింగ్, స్కామింగ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది. వీటి నిర్మూలనకు టెలికా నెట్ వర్క్ ఆపరేటర్లు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవల్లో కృత్రిమ మేధ ఆధారిత ఫిల్టర్స్ ను ఉపయోగించాలని ట్రాయ్ సూచించింది. సైబర్ నేరస్థులు కొందరు ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ చేసి వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తీసుకొని యూజర్లను మోసం చేస్తున్నారు. వాట్సాప్ కు ట్రూ కాలర్ వస్తే స్పామ్ కాల్స్ ను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఆ కాల్స్ లిప్ట్ చేయకుండా జాగ్రత్త పడే అస్కారం ఉంటుంది.