Planes Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానాలు గాలిలో ఇంధనాన్ని ఎందుకు వదులుతాయి? ఇంధనం ఎక్కడికి వెళుతుంది?
సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో భారీగా ఇంధనం నింపుతారు. కొన్ని విమానాలు 5,000 గ్యాలన్ల వరకూ ఇంధనాన్ని తమ ఫ్యుయెల్ టాంకుల్లో నింపుకుని బయలుదేరతాయి, ఇది సుమారు మూడు ఏనుగుల బరువుకు సమానం. అయితే, అత్యవసర పరిస్థితుల్లో, ఈ ఇంధనంలో పెద్ద భాగాన్ని విమానాలు గాల్లో ఉండగానే వదిలించుకుంటాయి. దీనిని ఫ్యూయెల్ డంపింగ్ అంటారు. ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసారు, ఈ సమయంలో భారీగా ఇంధనాన్ని వదిలించుకున్నారు.
టేకాఫ్, ల్యాండింగ్ బరువు
విమానం టేకాఫ్ చేసేటప్పుడు, ఎంత బరువు ఉండాలి, ల్యాండింగ్ సమయంలో ఎంత బరువు ఉండాలి అనే విషయాలు స్ఫష్టమైన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. విమానాలు భద్రంగా ల్యాండింగ్ కావాలంటే ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. బరువు పరిమితిని దాటితే, ప్రమాదం సంభవించవచ్చు. అందువల్ల, పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంధనం డంపింగ్ ప్రక్రియ
విమానం ఇంధనాన్ని దాని రెక్కల్లో నిల్వ చేస్తుంది. కాబట్టి, ఇంధనాన్ని వేగంగా జారవిడిచేందుకు ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. పైలట్ స్విచ్ ఆన్ చేస్తే, రెక్కల చివరల నాజిల్స్ తెరుచుకుని ఇంధనం వేగంగా పారబోస్తాయి. ఈ వ్యవస్థ ద్వారా క్షణాల్లో వేల కొద్దీ లీటర్ల ఇంధనాన్ని వదిలించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో, పైలట్లు విమానాన్ని గాల్లో చక్కెర్లు కొట్టి ఇంధనం వాడతారు, అయితే కొన్ని సందర్భాల్లో ఫ్యూయెల్ డంప్ చేస్తారు.
పర్యావరణ సురక్షణ
ఈ ప్రక్రియ పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం కనీసం 6,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఇంధనాన్ని జారవిడుస్తారు, తద్వారా ఇది కింద పడకుండా గాల్లోనే ఆవిరైపోతుంది. అయితే, ఈ ఫ్యూల్ డంపింగ్ వ్యవస్థ అన్ని విమానాల్లో ఉండదు. బోయింగ్ 777 ,747 మోడళ్లలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంటుంది, బోయింగ్ 737,ఎయిర్‌బస్ 320 వంటి విమానాల్లో ఇది లేదు.