Nvidia CEO: భవిష్యత్తులో భారతదేశం టోకెన్‌లను ఉపయోగించి AIని ఎగుమతి చేస్తుంది: నివిడియా సీఈఓ
భారతదేశం కంప్యూటర్ రంగంలో ప్రపంచానికి చాలా సుపరిచితమైందని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో కూడా తన ప్రతిభను చాటబోతుందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ అన్నారు. భారత్ భవిష్యత్తులో శక్తివంతమైన AI సొల్యూషన్లను ప్రపంచానికి ఎగుమతి చేయనుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఎన్విడియా AI సమ్మిట్‌లో హువాంగ్ ఈ విషయాలను వివరించారు. భారత్‌లో తమ ఎకోసిస్టమ్ విస్తరణకు కట్టుబడి ఉన్నామని, ఈ క్రమంలో AI టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామన్నారు.
AI ఎగుమతులలోనూ ముందంజలో భారత్
భారతదేశం కంప్యూటర్ రంగంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుందని,ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది అని ప్రశంసించారు. అలాగే, భవిష్యత్తులో AI ఎగుమతులలోనూ ప్రపంచంలో ముందంజలో ఉండే దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ ను ప్రపంచానికి ఎలా అందించిందో,AI ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందని వివరించారు. భారతదేశం భవిష్యత్తులో AI అభివృద్ధి,సరఫరాలో ఒక శక్తివంతమైన కేంద్రంగా మారబోతుందని అన్నారు. అదే సమయంలో AI వల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవని,వాటి స్వరూపం మారుతుందని హువాంగ్ స్పష్టం చేశారు. AI ఉద్యోగాలను హరించకపోవచ్చని,కానీ అది వ్యక్తులకు సహకరించే సాధనంగా మారుతుందని, ప్రతివ్యక్తికీ AI కో-పైలట్ లాంటి సహాయక టూల్స్ అందుబాటులో ఉండబోతున్నాయని వివరించారు.