LOADING...
'Like a sci-fi movie': 30 ఏళ్ల తర్వాత శిశువుగా మారిన పిండం: ప్రపంచ రికార్డు 
30 ఏళ్ల తర్వాత శిశువుగా మారిన పిండం: ప్రపంచ రికార్డు

'Like a sci-fi movie': 30 ఏళ్ల తర్వాత శిశువుగా మారిన పిండం: ప్రపంచ రికార్డు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఫ్రీజ్‌లో నిల్వ చేసిన ఒక పిండం ఇటీవల శిశువుగా జన్మించడం విశ్వవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఇదొక ప్రపంచ రికార్డు కావొచ్చని అంటున్నారు. ఇంత కాలం శీతలీకరించి భద్రపరిచిన పిండం శిశువుగా మారిన ఘటన ఇప్పటి వరకు నమోదు కాలేదని తెలిపారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన లిండ్సే,టిమ్ పియర్స్ అనే దంపతులకు సంభవించింది. వారిద్దరికీ ఒక మగ శిశువు జన్మించగా, ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించిందని వారు తమ భావోద్వేగాలను పంచుకున్నారు. తమకు సంతానం కలగకపోవడంతో దాదాపు ఏడేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ విజయవంతం కాలేదు. చివరికి, లిండా ఆర్చర్డ్ అనే మహిళకు చెందిన పిండాన్ని స్వీకరించాలని వారు నిర్ణయించుకున్నారు.

వివరాలు 

మూడు పిండాలను ఫ్రీజ్‌లో భద్రపరిచారు

లిండా ఆర్చర్డ్‌ 1994లో సహజసిద్ధంగా గర్భధారణ జరగకపోవడంతో IVF (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతిని ఆశ్రయించారు. ఆ సమయంలో ఆమె అండాలను, ఆమె భర్త వీర్యకణాలను ఉపయోగించి వైద్యులు నాలుగు పిండాలను రూపొందించారు. వీటిలో ఒకదానివల్ల ఆమెకు ఆడ శిశువు జన్మించింది. మిగిలిన మూడు పిండాలను ఫ్రీజ్‌లో భద్రపరిచారు. పర్యవసానంగా ఆమె భర్తతో విడాకులు తీసుకున్నప్పటికీ ఆ పిండాలను ఆమె వదిలిపెట్టలేదు. అవి ఇతరుల పరిశోధనలకోసం గానీ, తెలియని వ్యక్తులకు దానంగా ఇవ్వడం కూడా ఆమెకు ఇష్టం లేకపోయింది.

వివరాలు 

వాటి బాధ్యతను స్వీకరించిన క్రిస్టియన్‌ పిండ దత్తత కేంద్రం.. 

పిండాలను భద్రపరిచేందుకు ఆమె.. ఏటా వేలాది డాలర్లను చెల్లించారు. ఆ తర్వాత, ఒక క్రిస్టియన్ పిండ దత్తత సంస్థ ఆ పిండాల బాధ్యతను తీసుకుంది. అయితే, ఆర్చర్డ్ పేర్కొన్న కొన్ని షరతుల మేరకు.. అవి అమెరికాలో నివసించే వివాహిత, శ్వేతజాతి క్రిస్టియన్ జంటకే ఇవ్వాలని నిర్దేశించారు. ఈ షరతులు లిండ్సే, టిమ్‌ జంటకు సరిపోలాయి. ఈ నేపథ్యంలో,లిండ్సే గర్భంలోకి రెండు పిండాలను ప్రవేశపెట్టగా, అందులో ఒకటి మాత్రమే విజయవంతంగా శిశువుగా మారింది. ప్రస్తుతం లిండా ఆర్చర్డ్‌కు వయసు 62 సంవత్సరాలు. ఆమె కుమార్తెకు వయసు 30 సంవత్సరాలు. తాజాగా పుట్టిన శిశువు తన పిండం నుంచే వచ్చినదని తెలిసిన ఆర్చర్డ్, ఆ బిడ్డ ఫోటోను చూసి సంతోషపడ్డారు.