Page Loader
Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు! 
ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు!

Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో దర్శనమివ్వనున్న యాడ్స్‌.. అప్‌డేట్స్‌ ట్యాబ్‌లో ఇకపై ప్రకటనలు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 16, 2025
09:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) ఇకపై యాడ్స్‌ (ప్రకటనలు) చూపించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో ఎలాంటి ప్రకటనలూ లేకుండా, పూర్తిగా ఉచితంగా సేవలందిస్తూ వచ్చిన ఈ యాప్‌, ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకునే చర్యలలో భాగంగా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా, "అప్‌డేట్స్" ట్యాబ్‌లో ప్రకటనల ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు వాట్సప్‌ తన బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది. వాట్సప్‌ యాప్‌లోని "అప్‌డేట్స్" ట్యాబ్‌లో ప్రకటనలకు సంబంధించిన ఫీచర్లు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఇందులో చానెల్స్‌, స్టేటస్‌ విభాగాలు ఉన్నాయి. ఇకపై వీటిలోనే యాడ్స్‌ కనిపించబోతున్నాయి. రోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 బిలియన్‌ మంది యూజర్లు ఈ అప్‌డేట్స్‌ ట్యాబ్‌ను వీక్షిస్తున్నారని సంస్థ తెలిపింది.

వివరాలు 

మూడు రకాల ప్రకటనల ఫీచర్స్ 

ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,అడ్మిన్ లకు,వ్యాపారస్తులకు, సంస్థలకు వాట్సప్‌ ద్వారా ఎదగడానికి అవకాశమిస్తూ, ప్రకటనల ఫీచర్లను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. మొత్తం మూడు రకాల ప్రకటనల ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. 1. ఛానెల్‌ సబ్‌స్క్రిప్షన్‌: యూజర్లు ఒక నిర్దిష్ట నెలవారీ రుసుము చెల్లించి, తమకు ఇష్టమైన వాట్సప్‌ ఛానెల్‌కు మద్దతుగా ఉండే అవకాశం పొందుతారు. ఇది ఛానెల్‌ నిర్వాహకులకు ఆదాయాన్ని అందించడంలో దోహదపడుతుంది. 2. ప్రమోటెడ్‌ ఛానెల్స్‌: ప్రస్తుతం "ఎక్స్‌ప్లోర్" సెక్షన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని వాట్సప్‌ ఛానెల్స్‌ కనిపిస్తూ ఉంటాయి. ఇకపై, చానెల్‌ యాడ్మిన్లు ఫీజు చెల్లించి తమ ఛానెల్‌ను ప్రమోట్‌ చేసుకోవచ్చు. తద్వారా వారి ఛానెల్‌ మరిన్ని యూజర్లకు దర్శనమివ్వనుంది.

వివరాలు 

అప్‌డేట్స్‌ ట్యాబ్‌కు మాత్రమే 

3. స్టేటస్‌ ప్రకటనలు: ఇప్పటివరకు స్టేటస్‌ విభాగంలో వ్యక్తిగతంగా యూజర్లు పోస్ట్ చేసిన విషయాలే కనిపించేవి. ఇకపై, వ్యాపార ప్రకటనలతో కూడిన స్టేటస్‌లు కూడా ఇందులో కనిపించబోతున్నాయి. ఈ ప్రకటనలు కేవలం"అప్‌డేట్స్"ట్యాబ్‌లో మాత్రమే ఉండనున్నాయని వాట్సప్‌ స్పష్టంచేసింది. వ్యక్తిగత చాట్స్‌,కాల్స్‌ ముందులానే యాడ్‌ఫ్రీగా కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు,యూజర్ల మెసేజులు,కాల్స్‌,స్టేటస్‌లు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా పూర్తిగా భద్రతతో ఉంటాయని హామీ ఇచ్చింది. ప్రకటనల ప్రదర్శన కోసం యూజర్ల దేశం,నగరం,భాష వంటి ప్రాథమిక వివరాలను మాత్రమే సేకరిస్తామని స్పష్టంచేసింది. వ్యక్తిగత సమాచారం అయిన ఫోన్‌ నంబర్‌ను యాడ్వర్టైజర్లకు విక్రయించదని లేదా పంచుకోదని వాట్సప్‌ గట్టి భరోసా ఇచ్చింది. అయితే ఈ ప్రకటనల ఫీచర్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.