YouTube Create: ఏఐ సాయంతో పనిచేసే ఎడిటింగ్ యాప్ లాంచ్ చేసిన యూట్యూబ్
వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్, గురువారం జరిగిన మేడ్ ఆన్ యూట్యూబ్ ఈవెంట్ లో సరికొత్త ఎడిటింగ్ యాప్ ని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో పనిచేసే ఈ యాప్, ప్రస్తుతం ఇండియా, అమెరికా, ఇండోనేషియా, కొరియా, సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ యూజర్లు ఈ యాప్ ని వాడాలనుకుంటే వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. ఎవరైతే తమ మొదటి వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకుంటారో వాళ్లకు వీడియో ప్రొడక్షన్ ప్రాసెస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందులను దూరం చేయడానికి యూట్యూబ్ క్రియేట్ ఎడిటింగ్ యాప్ తీసుకొస్తున్నామని కంపెనీ వెల్లడి చేసింది.
ఏఐ సాయంతో పనిచేసే యాప్
యూట్యూబ్ క్రియేట్ ద్వారా ఫ్రీగా వీడియోలను ఎడిటింగ్ చేయవచ్చు. షార్ట్, లాంగ్ ఎలాంటి వీడియోస్ అయినా సరే ఇందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పని చేసే ఈ యాప్ అందరికీ సౌకర్యంగా ఉంటుంది. సుమారు 3000మంది క్రియేటర్లు అందించిన ఫీడ్ బ్యాక్ తో యూట్యూబ్ క్రియేట్ డిజైన్ చేసినట్లు కంపెనీ తెలియజేసింది. అంతేకాదు, డ్రీమ్ స్క్రీన్ అనే సరికొత్త ఫీచర్ ని కూడా యూట్యూబ్ లాంచ్ చేయబోతుంది. దీని ద్వారా వీడియోలను, ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ లను సృష్టించవచ్చు. మనమిచ్చే ఇన్ పుట్ ద్వారా వీడియోలు వాటికవే సృష్టించబడతాయని కంపెనీ తెలిపింది. డ్రీమ్ స్క్రీన్ అనేది 2024 వరకు అందుబాటులో ఉండనుంది.