Page Loader
YouTube Monetization Rules : యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు.. జూలై 15 నుంచి కఠినమైన నియమాలు అమల్లోకి! 
జూలై 15 నుంచి కఠినమైన నియమాలు అమల్లోకి!

YouTube Monetization Rules : యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు.. జూలై 15 నుంచి కఠినమైన నియమాలు అమల్లోకి! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

కంటెంట్ క్రియేటర్లకు ఓ పెద్ద షాక్ తగలనుంది. యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందేవారికి జూలై 15, 2025 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులతో వేలాది ఛానళ్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం యూట్యూబ్‌పై వేలాది ఛానెళ్లు పని చేస్తున్నాయి. వీటిలో చాలామంది ఏఐ టూల్స్ ద్వారా సులభంగా వీడియోలు తయారు చేస్తున్నారు. కొందరు ఇతరుల వీడియోల్ని స్వల్ప మార్పులతో తిరిగి అప్‌లోడ్ చేస్తూ, లేదా పాత వీడియోలను పునరావృతం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇదంతా అడ్డుకునేందుకు యూట్యూబ్ ఇప్పుడే సీరియస్‌గా కొత్త చర్యలు తీసుకుంటోంది.

వివరాలు 

జూలై 15 నుంచి ఏం మారుతుంది? 

ఒకే వీడియోను పదే పదే అప్‌లోడ్ చేయడం, లేదా ఇతరుల వీడియోలను తక్కువ మార్పులతో పోస్ట్ చేయడం చేసిన ఛానెళ్లకు ఇకపై యూట్యూబ్ నుంచి డబ్బులు రాకపోవచ్చు. అలాంటి వీడియోలు ఉంటే ఇప్పటికే ఉన్న మానిటైజేషన్ కూడా రద్దవుతుంది. వీడియోల క్వాలిటీ మెరుగ్గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని, యూట్యూబ్ నియమాలను మరింత కఠినతరం చేసింది. అసలైన క్రియేటర్లకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చారు.

వివరాలు 

ఇకపై మానిటైజేషన్ రాని  వీడియోలు ఇవే: 

అసలు కంటెంట్ కాకుండా స్వల్ప మార్పులతో రూపొందించిన వీడియోలు. టెంప్లేట్ ఆధారంగా తయారైన వీడియోలు. రోబోటిక్ వాయిస్‌లు ఉపయోగించిన వీడియోలు. ముఖం కనిపించకుండా ఉండే ఛానెల్లలో స్పామ్ కంటెంట్. అసత్యమైన సమాచారం లేదా ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా ఉండే వీడియోలు. ఒకే వీడియోను తరచూ అప్‌లోడ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే ప్రయత్నాలు. విద్యా లేదా వినోదానికి సంబంధించి కొత్తదనం లేకుండా రూపొందించిన కంటెంట్.

వివరాలు 

AI జనరేటెడ్ వీడియోలు ఎఫెక్ట్ అవుతాయా? : 

యూట్యూబ్ తాను ఏఐ కంటెంట్‌ను నిషేధించలేదని స్పష్టంగా చెప్పింది. కానీ, పూర్తిగా ఏఐ వాయిస్‌లు, ఆటోమేటెడ్ స్క్రిప్టులు, అవతార్ ఆధారంగా పనిచేసే ఛానళ్లపై కఠిన నియమాలు వర్తించవచ్చు. మానవ వాయిస్ లేకుండా, అసలైన క్రియేటివ్ కంటెంట్ లేకుండా తయారైన వీడియోలు మానిటైజేషన్‌కు అర్హత పొందకపోవచ్చు. వర్చువల్ యూట్యూబర్ల స్థితి ఏంటి? VTubers గా పిలవబడే వర్చువల్ యూట్యూబర్లు..అంటే యానిమేటెడ్ అవతార్‌లతో వీడియోలు చేసే వారు.. కాస్త సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. వాళ్లు తమ స్వంత వాయిస్, ఒరిజినల్ కంటెంట్ ఉపయోగిస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పటికే లక్షల్లో ఆదాయం పొందుతున్న VTubers ఉన్నారు. కానీ, పూర్తిగా ఏఐ ఆధారంగా వీడియోలు తయారుచేసే వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

వివరాలు 

కంటెంట్ క్రియేటర్లు ఏమి చేయాలి? 

వ్యక్తిగతమైన, ఒరిజినల్ కంటెంట్ తయారుచేయడంపై దృష్టి పెట్టాలి. ఇతరుల వీడియోలను కాపీ చేసి పోస్ట్ చేయకూడదు. టెంప్లేట్ ఆధారిత కంటెంట్ లేదా ఏఐ టూల్స్ వాడేటప్పుడు ప్రత్యేకమైన టచ్ ఇవ్వాలి. వీడియోలు ప్రత్యేకంగా ఉపయోగకరంగా, విలువతో ఉండేలా చూసుకోవాలి. జూలై 15 తర్వాత యూట్యూబ్ మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.

వివరాలు 

పాత నిబంధనలు ఎలా ఉండేవి? 

మునుపటి యూట్యూబ్ రూల్స్ ప్రకారం, యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందాలంటే: 12 నెలల్లో కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబర్లు, 4,000 గంటల పబ్లిక్ వాచ్ టైమ్ అవసరం. షార్ట్ వీడియోల విషయంలో 90 రోజుల్లో 10 మిలియన్ వ్యూస్ అవసరం. ఈ అర్హతలను పొందిన ఛానెళ్లకు మానిటైజేషన్ అందించేవారు. అప్పట్లో కాపీ, ఏఐ కంటెంట్ కూడా పనిచేసేది. కానీ, ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసివేశారు.