
YouTube: 20 ఏళ్లలో 20 బిలియన్ వీడియోల మైలురాయికి చేరిన యూట్యూబ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ (YouTube) అందరికీ సుపరిచితమే.
ఆధునిక కాలంలో ఇది మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది.
తాజాగా యూట్యూబ్ ఒక ఆసక్తికరమైన సమాచారం వెల్లడించింది. గడచిన 20 సంవత్సరాల కాలంలో 20 బిలియన్లకు పైగా వీడియోలు తమ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ అయ్యాయని యూట్యూబ్ తెలిపింది.
ఈ విషయాన్ని బుధవారం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ప్లాట్‌ఫామ్ 2005లో రూపుదిద్దుకుంది.
ప్రారంభం నుంచి దశలవారీగా అభివృద్ధి చెందుతూ యూజర్లను ఆకర్షించేందుకు పలు మార్పులు, నూతన ఫీచర్లు తీసుకువచ్చింది.
ఈ ప్రయాణంలో "యూట్యూబ్ షార్ట్స్" అనే ప్రత్యేక వీడియో ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడం విశేషమైన ఆదరణను పొందింది.
వివరాలు
"Me at the zoo"అనే టైటిల్‌తో తొలి వీడియో
దీని ద్వారా యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్‌గా ఎదిగిందని మార్కెట్ నిపుణుడు రాస్ బెనెస్ అభిప్రాయపడ్డారు.
ప్రతి రోజు సగటున 20 మిలియన్లకు పైగా వీడియోలు తమ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయని యూట్యూబ్ తెలిపింది.
యూట్యూబ్‌ను 2005లో పేపాల్ సంస్థకు చెందిన మిత్రులు అయిన స్టీవ్ చెన్, చాడ్ హర్లీ, జావేద్ కరీమ్‌లు కలిసి రూపొందించారు.
అదే ఏడాది ఫిబ్రవరి 14న "YouTube.com" అనే డొమైన్‌ను అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం ఏప్రిల్ 23న జావేద్ కరీమ్ "Me at the zoo"అనే టైటిల్‌తో తొలి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
కేవలం 19 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోకు ఇప్పటివరకు 348 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం.