LOADING...
Test Cricket : టెస్ట్ క్రికెట్‌కు 149 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో విజేత ఎవరు?
టెస్ట్ క్రికెట్‌కు 149 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో విజేత ఎవరు?

Test Cricket : టెస్ట్ క్రికెట్‌కు 149 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో విజేత ఎవరు?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రపంచంలో కాలక్రమేణా అనేక ఫార్మాట్లు వచ్చినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌ను ఇప్పటికీ అసలైన క్రికెట్‌గా భావిస్తారు. ఐదు రోజుల పాటు నాలుగు ఇన్నింగ్స్‌లతో సాగించే ఈ ఫార్మాట్ ఆటగాళ్ల ప్రతిభ, సహనం, మానసిక ధైర్యానికి నిజమైన పరీక్షగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక ఫార్మాట్ ప్రారంభమై నేటికి కచ్చితంగా 149 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రపంచంలోని తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ 1877 మార్చి 15న ప్రారంభమైంది.

వివరాలు

ఎక్కడ జరిగింది? ఏ జట్లు ఆడాయి?

ప్రపంచంలో మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఈ చారిత్రక మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. 1877 మార్చి 15 నుండి 19 వరకు జరిగిన ఈ పోటీలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ డేవ్ గ్రెగొరీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ చార్లెస్ బానర్‌మన్ 165 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నమోదైన తొలి సెంచరీ ఇదే. బానర్‌మన్ పోరాటం వల్ల ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది.

వివరాలు

అద్భుత ఇన్నింగ్స్

అనంతరం ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 49 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు 154 పరుగుల లక్ష్యం లభించింది. కానీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ఆస్ట్రేలియా బౌలర్ టామ్ కెండల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది.

Advertisement

వివరాలు

చారిత్రక ప్రాధాన్యం

ఈ మ్యాచ్‌తోనే టెస్ట్ క్రికెట్ అనే సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైంది. తరువాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన పోటీలు ప్రపంచ ప్రసిద్ధ 'యాషెస్' సిరీస్‌కు పునాది అయ్యాయి. నేటి కాలంలో టీ20 వంటి వేగవంతమైన ఫార్మాట్లు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, టెస్ట్ క్రికెట్‌కు ఉన్న 149 ఏళ్ల గొప్ప చరిత్రకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

వివరాలు

తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన జట్లు

ఆస్ట్రేలియా జట్టు: చార్లెస్ బానర్‌మన్, నాట్ థామ్సన్, టామ్ హొరాన్, డేవ్ గ్రెగొరీ (కెప్టెన్), బ్రాన్స్‌బై కూపర్, బిల్లీ మిడ్‌వింటర్, నెడ్ గ్రెగొరీ, జాక్ బ్లాక్‌హామ్ (వికెట్ కీపర్), టామ్ గారెట్, టామ్ కెండల్, జాన్ హోడ్జెస్. ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ జుప్, జాన్ సెల్బీ (వికెట్ కీపర్), హ్యారీ చార్ల్‌వుడ్, జార్జ్ ఉల్యెట్, ఆండ్రూ గ్రీన్‌వుడ్, టామ్ ఆర్మిటేజ్, ఆల్ఫ్రెడ్ షా, టామ్ ఎమ్మెట్, అలాన్ హిల్, జేమ్స్ లిల్లీవైట్ (జూనియర్) (కెప్టెన్), జేమ్స్ సౌథర్టన్.

Advertisement