Loading...
Priyansh Arya: 19 సిక్సర్లు.. 181 పరుగులు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ష్ సునామీ ఇన్నింగ్స్!
19 సిక్సర్లు.. 181 పరుగులు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ష్ సునామీ ఇన్నింగ్స్!

Priyansh Arya: 19 సిక్సర్లు.. 181 పరుగులు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ష్ సునామీ ఇన్నింగ్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో భారత టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా సమం చేశాడు.

వివరాలు

19 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఆర్య

ఎడమచేతి వాటం ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య తన ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు, ఏడు ఫోర్లు బాదాడు.

అతడి విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇండోర్‌లోని డాలీ కాలేజ్ గ్రౌండ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు సాధించింది.

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో ఆర్య ఇన్నింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన లువాన్-డ్రే ప్రిటోరియస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

2026 అక్టోబర్‌లో జరిగిన సీఎస్ఏ ప్రో20 కప్‌లో టైటాన్స్ తరఫున నైట్స్‌తో తలపడి అతడు 79 బంతుల్లో అజేయంగా 188 పరుగులు చేశాడు.

వివరాలు

కేఎల్ రాహుల్ రికార్డు బద్దలు

ఈ ఇన్నింగ్స్‌తో ప్రియాన్ష్ ఆర్య భారత టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై రాహుల్ అజేయంగా 152 పరుగులు చేశాడు.

తాజాగా తమిళనాడుతో మ్యాచ్‌లో 181 పరుగులు చేసిన ఆర్య ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

ADVERTISEMENT

వివరాలు

36 బంతుల్లోనే సెంచరీ

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి మూడో ఓవర్‌లో యశ్ ధుల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అతడు ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు.

అయితే మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నితీశ్ రాణాతో కలిసి రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఇందులో రాణా 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు. మరోవైపు ఆర్య కేవలం 36బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో 12 సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 68 బంతుల్లో 181 పరుగుల భారీ స్కోరుతో ఢిల్లీకి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.

ADVERTISEMENT