Cricket : క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు!
ఈ వార్తాకథనం ఏంటి
టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ వంటి క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ గురించి తరచూ వింటుంటాం. పురుష, మహిళా క్రీడాకారులు కలిసి ఒకే జట్టుగా బరిలోకి దిగుతారు. ఇప్పుడు ఇదే తరహా ప్రయోగం క్రికెట్లోనూ జరగనుంది. తొలిసారిగా మిక్స్డ్ జెండర్ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి ఒకే జట్టుగా ఆడనున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ పోటీలు 80 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబో ఈ వినూత్న టోర్నీకి వేదిక కానుంది. అక్కడి సింహలెస్ స్పోర్ట్స్ క్లబ్ నవంబర్ 14నుంచి 29వరకు 'టెస్టు ట్వంటీ' పేరుతో ఈ పోటీలను నిర్వహించనుంది. క్రికెట్లో సమానత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు, బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పించడం ఈ టోర్నీ ప్రధాన ఉద్దేశం.
వివరాలు
రెండు బంతులు.. పారిటీ రూల్ ప్రత్యేకత!
ఈ టోర్నీలో అనుసరించనున్న నిబంధనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటంటే..
1.నాలుగు ఖండాల నుంచి ఆటగాళ్ల ఎంపిక: నాలుగు ఖండాలకు చెందిన 13 నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన దాదాపు 160 మంది ఆటగాళ్లను టోర్నీ కమిటీ ఎంపిక చేసింది. వీరిని నాలుగు జట్లుగా విభజించారు.
2.ఒక్కో జట్టులో 40 మంది: ప్రతి జట్టులో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు. ఒకే రోజులో 80 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు.
3.ఒక్కో జట్టు 40 ఓవర్లు: 80 ఓవర్ల మ్యాచ్ అంటే ఒకే జట్టు మొత్తం బ్యాటింగ్ చేస్తుందని అనుకోవద్దు.
ఒక్కో జట్టుకు 40 ఓవర్లు కేటాయిస్తారు. ఒక్క ఇన్నింగ్స్లో కాకుండా రెండు విడతల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.
వివరాలు
4. రెండు మ్యాచ్లు.. రెండు రకాల బంతులు
మొదటి 20 ఓవర్ల మ్యాచ్ను ఎర్ర బంతితో, తెల్ల దుస్తులు ధరించి పగటి సమయంలో ఆడతారు. రెండో 20 ఓవర్ల మ్యాచ్ను తెల్ల బంతితో, రంగుల జెర్సీలు ధరించి ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తారు.
ఇలా ఒకే రోజు రెండు భిన్నమైన క్రికెట్ అనుభవాలను ఆటగాళ్లు పొందనున్నారు.
5. టాస్ కీలకం
ఈ టోర్నీలో టాస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలా? బౌలింగ్ చేయాలా? అనే నిర్ణయంతోపాటు, తొలుత బాలికలు ఆడాలా? బాలురు ఆడాలా? అన్నది కూడా ఎంచుకోవచ్చు.
వివరాలు
6. పారిటీ రూల్ ప్రధాన ఆకర్షణ
మిక్స్డ్ జెండర్ క్రికెట్లో 'పారిటీ రూల్' కీలకంగా ఉండనుంది. పారిటీ అంటే సమానత్వం. బాలురు, బాలికలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ నిబంధన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.
7. సమష్టి ప్రదర్శనే విజయానికి కీలకం
ఈ ఫార్మాట్లో బాలురు, బాలికలు ఇద్దరూ కలిసి మెరుగైన ప్రదర్శన చేసినప్పుడే జట్టు విజయావకాశాలు పెరుగుతాయి.
రెండు విభాగాల ఆటగాళ్లు సాధించిన పరుగులను కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తారు. దీంతో జట్టులోని ప్రతి ఒక్కరి ప్రదర్శనకు ప్రాధాన్యం ఉంటుంది.
వివరాలు
బాలబాలికలకు సమాన అవకాశాలు: టోర్నీ నిర్వాహకులు
'టెస్టు ట్వంటీ' టోర్నీ ద్వారా బాలబాలికలకు సమాన అవకాశాలు లభిస్తాయని ఈ పోటీల వ్యవస్థాపకుడు గౌరవ్ భిర్వాని తెలిపారు.
ఈ ఫార్మాట్లో టాస్ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ టోర్నీ అడ్వైజరీ బోర్డులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్, వెస్టిండీస్ దిగ్గజం సర్ క్లైవ్ లాయిడ్ ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
గ్లోబల్ సెలక్షన్ కమిటీకి దిల్లీ కోచ్ రాజ్కుమార్ శర్మ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. టోర్నీ కార్యకలాపాలకు మైక్ ఫోర్దమ్ నాయకత్వం వహిస్తారు.
మొత్తంగా, పురుషులు, మహిళలు కలిసి ఆడే మిక్స్డ్ జెండర్ క్రికెట్కు 'టెస్టు ట్వంటీ' కొత్త వేదికగా నిలవనుంది.