Shakib Al Hasan: బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతనిపై మర్డర్ కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లామ్ ఈ కేసును దాఖలు చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన జరిగిన ర్యాలీలో రఫీకుల్ కుమారుడు రూబెల్ మృతి చెందాడు. ఈ ఘటనపై అడోబార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 28వ నిందితుడిగా షకీబ్, 55వ నిందితుడిగా బంగ్లా పాపులర్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్ పేరును చేర్చారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు
రూబెల్ మృతి కేసులో మొత్తం 154 మంది నిందితులుగా చేర్చారు. ఇందులో మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఉన్నారు. తన కుమారుడు మరణానికి షేక్ హసీనా ప్రభుత్వమే కారణమని మృతుడి తండ్రి ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరుఫున షకీబ్, ఫెర్దౌస్ అహ్మద్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో వారిద్దరూ కూడా పదవిని కోల్పోయారు.