IND w Vs SL w: ఆరంభం అదిరింది.. తొలి టీ20లో భారత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం, భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ సేన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. ప్రపంచకప్‌లో కలిసి రాని విశాఖపట్నం వేదిక ఈసారి మాత్రం భారత అమ్మాయిలకు పూర్తిగా అనుకూలంగా మారింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన బౌలర్లు, ప్రపంచకప్ ఫామ్‌ను కొనసాగిస్తూ జెమీమా రోడ్రిగ్స్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ అలవోక విజయాన్ని అందుకుంది. బంతితో, బ్యాటుతో సమగ్రంగా రాణించిన భారత మహిళల జట్టు తొలి టీ20లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Details
రాణించిన దీప్తి శర్మ
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక, భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన ముందు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ విష్మి గుణరత్నె (39; 43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు రనౌటవడం విశేషం. భారత బౌలర్లలో దీప్తి శర్మ (4-1-20-1) అద్భుతంగా బౌలింగ్ చేసింది. క్రాంతి గౌడ్, శ్రీ చరణి తలో వికెట్ తీశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు చురుకైన ఫీల్డింగ్‌తో శ్రీలంక పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
Details
ఛేదనలో భారత్ దూకుడు
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలో షెఫాలి వర్మ (9) వికెట్ కోల్పోయినా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. జెమీమా రోడ్రిగ్స్ వచ్చీ రాగానే బ్యాటుకు పని చెప్పి బౌండరీల వర్షం కురిపించింది. ఆమె స్మృతి మంధాన (25; 25 బంతుల్లో 4×4)తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు అభేద్యమైన 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన జెమీమా 69 పరుగులు నాటౌట్‌గా(44 బంతుల్లో 10×4)చెలరేగింది. భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 32 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Details
లంక తడబాటు.. భారత్ ధనాధన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ఆద్యంతం తడబడింది. మూడు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన కెప్టెన్ చమరి ఆటపట్టు (15)ను క్రాంతి బౌల్డ్ చేయడంతో లంక కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎండ్‌లో విష్మి నిలబడినా ఆశించినంత వేగంగా ఆడలేకపోయింది. విష్మితో హసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) భాగస్వామ్యాలు నెలకొల్పినా, స్కోరు వేగం పెరగలేదు. చివరి ఓవర్లలోనూ పరుగుల రేటు పెరగకపోవడంతో లంక పరిమిత స్కోరుకే పరిమితమైంది.
Details
స్మృతి @ 4000
ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనత నమోదైంది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి భారత బ్యాటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల టీ20ల్లో ఈ క్లబ్‌లో ముందుగా అడుగుపెట్టినది న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ (4,716). ఆమె తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా స్మృతి నిలిచింది.