Gukesh vs Javokhir Sindarov: గుకేశ్‌కు అసలైన పరీక్ష.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫేవరెట్‌గా సిందరోవ్!
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ వంటి దిగ్గజాలు సైతం అందుకోని ఘనతను సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్. రెండేళ్ల క్రితం చెస్ ప్రపంచంలో సంచలనంగా మారిన అతడు.. కేవలం 18ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. అసాధారణ ప్రతిభతో అతి తక్కువ సమయంలోనే చెస్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఈ యువ ఆటగాడికి ఇప్పుడు మరో పెద్ద సవాలు ఎదురుకానుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. అయితే ఈసారి పోటీ అంత సులభంగా ఉండేలా కనిపించడం లేదు. అనుభవం లేని యువ ఆటగాడైనప్పటికీ.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందరోవ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
వివరాలు
ఫామ్ లేమితో గుకేశ్‌కు సవాల్
తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న అతడే ఈ పోరులో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు.
మరి అంచనాలను తలకిందులు చేసి గుకేశ్ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ తన కెరీర్‌లో మరో కఠిన పరీక్షకు సిద్ధమయ్యాడు.
మంగళవారం స్విట్జర్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఛాలెంజర్ జవోఖిర్ సిందరోవ్‌తో తలపడనున్నాడు.
తొలి గేమ్‌లో గుకేశ్ నల్ల పావులతో ఆడనున్నాడు. 2024 డిసెంబరులో చైనాకు చెందిన సీనియర్ ఆటగాడు డింగ్ లిరెన్‌పై చారిత్రక విజయం సాధించి, 18 ఏళ్లకే ప్రపంచ విజేతగా నిలిచాడు గుకేశ్. సాధారణంగా ఈసారి కూడా అతడే ఫేవరెట్‌గా ఉండాలి.
వివరాలు
వరుస పరాజయాలతో రేటింగ్ పతనం
కానీ మాగ్నస్ కార్ల్‌సన్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు సిందరోవ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఇందుకు ప్రధాన కారణం గుకేశ్ ప్రస్తుత ఫామ్. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేశ్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. గత ఏడాది కాలంగా అతడి ఆట ఆశించిన స్థాయిలో లేదు.
గతేడాది టాటా స్టీల్ చెస్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన గుకేశ్.. నార్వే చెస్ టోర్నీలో మూడో స్థానాన్ని సాధించాడు.
అప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన అతడు.. 2025 చివరి నాటికి ఫామ్ కోల్పోయాడు. ఫిడే ప్రపంచకప్‌లో త్వరగానే నిష్క్రమించాడు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లలోనూ ముందు వరుసలో నిలవలేకపోయాడు.
వివరాలు
ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో తొమ్మిదో స్థానం
ఈ ఏడాది కూడా అతడి ఆటతీరులో పెద్దగా మార్పు కనిపించలేదు. టాటా స్టీల్ చెస్‌లో ఉమ్మడిగా ఎనిమిదో స్థానం, ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో తొమ్మిదో స్థానంతో నిరాశపరిచాడు.
నార్వే చెస్‌లోనూ అట్టడుగు స్థానానికి పరిమితమయ్యాడు. ఈ వరుస ఫలితాల ప్రభావం అతడి రేటింగ్‌పై పడింది.
దాదాపు 70 క్లాసికల్ రేటింగ్ పాయింట్లు కోల్పోయిన గుకేశ్ ప్రస్తుతం 2710 పాయింట్లతో కొనసాగుతున్నాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అతడు.. ప్రస్తుతం 26వ స్థానానికి పడిపోయాడు.
వివరాలు
జోరు మీదున్న సిందరోవ్
మరోవైపు ఈ ఏడాది క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌తో తలపడే అర్హతను జవోఖిర్ సిందరోవ్ సాధించాడు.
అంతేకాకుండా 2025 ఫిడే ప్రపంచకప్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 2782 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇటీవల సిందరోవ్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది.
తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే భారత యువ గ్రాండ్‌మాస్టర్ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.
వివరాలు
ఛాంపియన్‌షిప్ ఫార్మాట్ ఇదే!
ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎప్పటిలాగే మొత్తం 14 క్లాసికల్ గేమ్‌లు నిర్వహిస్తారు.
ప్రతి గేమ్‌లో విజయం సాధించిన ఆటగాడికి ఒక పాయింట్, మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇద్దరికీ చెరో అర పాయింట్ లభిస్తుంది.
ముందుగా 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు. 14 గేమ్‌లు పూర్తయ్యే సమయానికి ఇద్దరూ సమాన పాయింట్లతో నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
వివరాలు
రూ.23 కోట్ల భారీ ప్రైజ్‌మనీ
ఈ ఛాంపియన్‌షిప్ కోసం మొత్తం రూ.23 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించారు. మ్యాచ్ ఫలితం ఆధారంగా ప్రైజ్‌మనీని విభజిస్తారు.
ఒక్కో విజయానికి దాదాపు రూ.1.8 కోట్లు కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా పంచుతారు.
మ్యాచ్ టైబ్రేకర్ ద్వారా తేలినా, 7.5-6.5 స్కోరుతో ముగిసినా లేదా 14 గేమ్‌ల అనంతరం 8-6తో ఫలితం వచ్చినా.. విజేతకు రూ.12 కోట్లు, రన్నరప్‌కు రూ.11 కోట్లు అందుతాయి.
వివరాలు
గుకేశ్-సిందరోవ్ పోరులో ఆసక్తికర విషయాలు
1: ఉజ్బెకిస్థాన్ నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి ఆటగాడు జవోఖిర్ సిందరోవ్.
18: గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పుడు అతడి వయసు 18 ఏళ్లు. 18 ఏళ్ల 6 నెలల వయసులో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
20: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి గేమ్ సమయానికి గుకేశ్, సిందరోవ్ ఇద్దరి వయసు 20 ఏళ్లు. టోర్నీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుల మధ్య జరుగుతున్న పోటీ ఇదే.
3: గతంలో ఈ ఇద్దరూ మూడు క్లాసికల్ గేమ్‌లలో తలపడ్డారు. ఇందులో సిందరోవ్ రెండు గేమ్‌ల్లో విజయం సాధించగా.. మరో గేమ్ డ్రాగా ముగిసింది.