Nandini Sharma : డబ్ల్యూపీఎల్‌లో సంచలనం.. ఒక్క ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన చండీగఢ్ పేసర్!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ఓ అరుదైన అద్భుతం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక యువ బౌలర్ చరిత్రను తిరగరాసింది. కేవలం 24 ఏళ్ల వయసున్న చండీగఢ్ పేసర్ నందిని శర్మ, గుజరాత్ బ్యాటర్లను తన వేగంతో వణికించి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడమే కాకుండా, ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇలాంటి ప్రదర్శన చేయడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Details
హ్యాట్రిక్ నమోదు చేసిన నందిని శర్మ
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు పెద్దగా సంచలనం లేకుండా సాగింది. కానీ నందిని శర్మ బంతిని చేతబట్టిన తర్వాత మ్యాచ్ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆ ఓవర్లో ఆమె ఏకంగా నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుదిపేసింది. ముఖ్యంగా చివరి మూడు బంతుల్లో వరుసగా కనికా అహుజా, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్‌లను అవుట్ చేసి అద్భుతమైన హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందే ప్రమాదకర బ్యాటర్లు యాష్లే గార్డనర్, కాష్వీ గౌతమ్‌లను పెవిలియన్‌కు పంపి కీలక బ్రేక్‌లు ఇచ్చింది. మొత్తం నాలుగు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన నందిని, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
Details
నాలుగో బౌలర్ గా రికార్డు
డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా నందిని శర్మ నిలిచింది. ఇంతకుముందు ఈ ఘనతను ఇజీ వాంగ్ (ముంబై ఇండియన్స్), గ్రేస్ హారిస్ (యూపీ వారియర్స్), దీప్తి శర్మ (యూపీ వారియర్స్) మాత్రమే సాధించారు. అయితే, ఐదు వికెట్లు సాధించిన మొట్టమొదటి అన్‌క్యాప్డ్ బౌలర్‌గా నందిని కొత్త రికార్డు నెలకొల్పింది. 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో నందినిని కొనుగోలు చేయగా, ఆమె ఈ రోజు చేసిన ప్రదర్శన ఆ పెట్టుబడికి వంద రెట్లు న్యాయం చేసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Details
హ్యాట్రిక్ వస్తుందని అస్సలు ఊహించలేదు
హ్యాట్రిక్ ఘనత అనంతరం నందిని శర్మ తన ఆనందాన్ని పంచుకుంది. నా పూర్తి దృష్టి సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంపైనే పెట్టాను. ప్రతి బంతికి ముందు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ నాతో మాట్లాడుతూ నన్ను ఉత్సాహపరిచారు. స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయమని వారు ఇచ్చిన సలహా బాగా పనిచేసింది. నిజానికి హ్యాట్రిక్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ వికెట్లు పడతాయని టీమ్ నమ్మకం ఇచ్చింది. నా మొదటి ఓవర్ తర్వాత బౌలింగ్‌లో చిన్న మార్పులు చేశాను, అవే నాకు ఈ విజయాన్ని అందించాయని నందిని తెలిపింది.