Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్!
భారత రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ సింగ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు విరామం ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఈనెల 15వ తేదీ నాటికల్లా విచారణ పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇవ్వడంతో.. అప్పటి వరకూ ఆందోళనను నిలిపివేస్తున్నట్లు రెజ్లర్లు వెల్లడించారు. కేంద్ర కీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో ఐదు గంటలకు పైగా జరిగిన సమావేశంలో రెజ్లర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈనెల 15లోపు పోలీసుల విచారణ పూర్తి అవుతుందని, అప్పటివరకూ ఓపికతో ఉండాలని ఆయన కోరారు.
రెజ్లర్ల ఫెడరేషన్ కు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం!
రెజ్లర్లతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తామని అనురాగ్ ఠాకూర్ మంగళవారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అనురాగ్ ఠాకూర్ తో చర్చల అనంతరం బజరంగ్ పునియా మీడియాతో మాట్లాడారు. రెజ్లర్ల ఫెడరేషన్ కు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, మహిళా అధ్యక్షురాలి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటయ్యే కమిటీలో బ్రిజ్ భూషణ్ కు సంబంధించిన వ్యక్తులెవరూ లేకుడా చూస్తామని హామీ లభించిందని పేర్కొన్నారు. సాక్షి మాలిక్ మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉపసంహరించలేదని, ఇది తాత్కాలికమేనని స్పష్టం చేసింది.