LOADING...
Bronco Test: బ్రాంకో టెస్ట్.. ఓ చెత్త: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ 
బ్రాంకో టెస్ట్.. ఓ చెత్త: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌

Bronco Test: బ్రాంకో టెస్ట్.. ఓ చెత్త: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యోయో టెస్టుకు అదనంగా, ఇప్పుడు బ్రాంకో టెస్ట్ను కూడా జట్టు అమలు చేసేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా భారత జట్టుకు చేరిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ ఈ పరీక్షను పరిచయం చేశారు. ఇప్పుడు నుండి, ఒక ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించాలంటే, అతడు యోయో టెస్టు పక్కా బ్రాంకో టెస్ట్ను కూడా పాసవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ పరీక్షపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

నిజానికి బ్రాంకో టెస్ట్ ఒక చెత్త పరీక్ష: ఏబీ డివిలియర్స్‌

"నాకు 16 ఏళ్లు వయసున్నప్పటి నుండే బ్రాంకో టెస్ట్‌లో పాల్గొంటున్నాను. సౌతాఫ్రికాలో దీన్ని 'స్ప్రింట్ రిపీట్ ఎబిలిటీ టెస్ట్' అని పిలుస్తారు. మొదట బ్రాంకో టెస్ట్ అనే పేరు విన్నప్పుడు, నాకు దీని అర్థం స్పష్టంగా తెలియలేదు. కానీ వివరంగా తెలుసుకున్న తర్వాత, నేను దీన్ని గుర్తించగలిగా. నిజానికి, బ్రాంకో టెస్ట్ ఒక చెత్త పరీక్ష. సుదూరంగా ఉన్న ప్రిటోరియా విశ్వవిద్యాలయం సమీపంలోని సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌లో, సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో, చల్లని శీతాకాలపు ఉదయం, తక్కువ ఆక్సిజన్ ఉన్న చోట ఈ టెస్ట్‌లో పాల్గొన్న రోజు ఇంకా నన్ను గుర్తు ఉంది. దీంతో అప్పుడు నాకు ఊపిరితిత్తులు మండిపోయినట్లైంది' అని ఏబీ డివిలియర్స్‌ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

వివరాలు 

 రగ్బీ ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ టెస్ట్ 

బ్రాంకో టెస్ట్ అంటే పరుగు ఆధారిత ఫిట్‌నెస్ పరీక్ష. ఇది ముఖ్యంగా రగ్బీ ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఆటగాళ్ల శారీరక సామర్థ్యం, వేగం, మానసిక దృఢత్వం వంటి అంశాలపై అంచనాకు రావచ్చు. పరీక్షలో 20, 40, 60 మీటర్ల దూరాల్లో పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒక్క సెట్‌లో మొత్తం 240 మీటర్లు పరుగెత్తాలి. మొత్తం 5 సెట్లను ఆగకుండా పూర్తి చేయడం అవసరం. అంటే, ఒక్కో క్రికెటర్ ఆరు నిమిషాల వ్యవధిలో 1200 మీటర్లు విరామం లేకుండా పరుగెత్తాలి. ఎంత వేగంగా పూర్తి చేస్తారో, అంత ఫిట్‌గా ఉన్నట్లు.

వివరాలు 

టెస్ట్‌పై భిన్న అభిప్రాయాలు

అయితే, ఈ టెస్ట్‌పై భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. టీమ్ఇండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ బ్రాంకో టెస్ట్‌ను ప్రశంసించారు. అయితే, ఈ టెస్ట్‌ను రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించడానికి మాత్రమే ప్రవేశపెట్టారన్నారు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ . అలాగే, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ టెస్ట్‌పై నేరుగా స్పందించారు. ఆయన ప్రకారం, ఈ పరీక్ష కారణంగా ఆటగాళ్లు గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది.