LOADING...
Abhishek Nayar : డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..హెడ్‌ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌.. 
డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..

Abhishek Nayar : డబ్ల్యూపీఎల్ 2026కి ముందు కీలక నిర్ణయం తీసుకున్న యూపీ వారియర్స్..హెడ్‌ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు యూపీ వారియర్స్ తమ జట్టులో కీలక మార్పును చేపట్టింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్,మాజీ అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన జాన్ లూయిస్ స్థానంలో అభిషేక్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. లూయిస్ గత మూడు సీజన్లుగా యూపీ వారియర్స్‌కు హెడ్ కోచ్‌గా సేవలందించారు.

వివరాలు 

అభిషేక్ నాయర్ యూపీ వారియర్స్‌కు గొప్ప ఆస్తి

ఈ సందర్భంగా యూపీ వారియర్స్ డైరెక్టర్, COO క్షేమల్ వైంగంకర్ మాట్లాడుతూ.. "అభిషేక్ నాయర్ జట్టుకు ప్రధాన కోచ్‌గా చేరడం విజయవంతమైన భవిష్యత్తుకు మేము వేసిన తొలి మెట్టు. జట్టు మేనేజ్‌మెంట్‌లో అతని వంటి అనుభవజ్ఞుడి చేరిక యూపీ వారియర్స్‌కు గొప్ప ఆస్తి. ఆటగాళ్లను అభివృద్ధి పథంలో నడిపించడంలో అతనికి ఉన్న నైపుణ్యం అసాధారణం. ఇలాంటి ప్రతిభ దేశీయ క్రికెట్‌లో చాలా కొద్దిమందికే ఉంది," అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

18 నెలల్లోనే అభిషేక్ మూడు ఛాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన జట్లలో భాగం

"కేవలం గత 18 నెలల్లోనే అభిషేక్ మూడు ఛాంపియన్‌షిప్ టైటిల్స్ గెలిచిన జట్లలో భాగంగా ఉన్నాడు. ప్రతి విజయంలోనూ అతను భిన్నమైన పాత్రను పోషించడమే కాకుండా, వాటి మీద శాశ్వత ప్రభావం కూడా చూపించాడు. కలిసికట్టుగా, ధైర్యంగా ఆడే, నిరంతరం అభివృద్ధి కోరుకునే యూపీ వారియర్స్‌కు అతను నాయకత్వం వహించడంలో మేము గర్వంగా భావిస్తున్నాం," అని క్షేమల్ వైంగంకర్ చెప్పారు.

వివరాలు 

కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించిన యూపీ వారియర్స్

మరోవైపు, డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లో యూపీ వారియర్స్ జట్టు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 8 మ్యాచ్‌ల్లో పాల్గొన్న యూపీ, కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్టులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలో భాగంగానే అభిషేక్ నాయర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూపీ వారియర్స్..హెడ్‌ కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌..